
నాణ్యతకు తిలోదకాలు.!
● బాల సదనం భవన నిర్మాణంలో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
● వాగు ఇసుకకు బదులుగా ఫిల్టర్ ఇసుక, డస్ట్ వినియోగం
● గాలికొదిలేసిన నిర్మాణ క్యూరింగ్
● గడువుకు ముందే పని పూర్తిచేసిన కాంట్రాక్టర్
● పట్టించుకోని ఐసీడీఎస్, ఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు
మహబూబ్‌నగర్ రూరల్: అనాథ పిల్లలకు ఆశ్రమంగా ఉన్న బాల సదనం శిథిలావస్థకు చేరుకుంది. చిన్నారుల రక్షణ కోసం కొత్త భవనాన్ని నిర్మించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. మహిళా, శిశు సంక్షేమశాఖ అధీనంలో కొనసాగుతున్న మహబూబ్‌నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ ప్రాంతంలోని బాల సదనం శిథిలావస్థకు చేరుకోవడం, అనాథ పిల్లలు ఇబ్బందులు పడటం గుర్తించిన కలెక్టర్ వెంటనే ఎస్టిమేట్ తయారు చేసి నూతన బాల సదనం భవనాన్ని నిర్మించేందుకు అధికారులను ఆదేశించారు. దీంతో టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్లు స్టేట్ హోమ్ ప్రాంగణంలో నూతన బాల సదనం భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించి పనులు చేపట్టారు. రూ.1.36 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో రూ.1,34,93,500లు మంజూరయ్యాయి. నూతన బాల సదనం నిర్మాణానికి మొదటి విడతగా రూ.38,60,375లు విడుదలయ్యాయి. భవన నిర్మాణం కోసం కాంట్రాక్టర్‌కు ఏడాది గడువు విధించగా.. సదరు కాంట్రాక్టర్ గడువుకు ముందే భవనం పూర్తి చేయడం గమనార్హం. ఐసీడీఎస్ అధికారులు గానీ, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్లు గానీ సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే కాంట్రాక్టర్ తనకిష్టం వచ్చినట్లు పనులు నాసిరకంగా చకచక చేసి పెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
కాంట్రాక్టర్‌కు అండగా ఓ ఇంజనీర్
బాల సదనం నూతన భవనం నిర్మాణం విషయంలో సంబంధిత టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఉదాసీనత వల్లే పనుల్లో డొల్లతనం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు ఇంజనీర్ కాంట్రాక్టర్‌కు పూర్తి స్థాయిలో అండదండలు ఇవ్వడం వల్లే నాసిరకం పనుల పట్ల ఎవరు కూడా పట్టించుకోవట్లేదని స్టేట్ హోమ్ ప్రాంగణంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు పెదవి వేరుస్తున్నారు.
నాణ్యతగానే పనులు ఉన్నాయి
స్టేట్ హోమ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన బాల సదనం పనులు నాణ్యతగానే ఉన్నాయి. ఇందులో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం గానీ, ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం లేదు. కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారమే పనులు చేపట్టారు. భవన నిర్మాణం పూర్తికి ఏడాది గడువు ఇస్తే ఆయన ఆరు నెలలోగా పూర్తి చేయించారు.

నాణ్యతకు తిలోదకాలు.!