
కనువిందుగా తెప్పోత్సవం
● అశేష జనవాహినితోపులకించిన పుష్కరఘాట్
అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి తుంగభద్ర తీరాన కనులపండువగా జరిగింది. అశేష జనవాహిని నడుమ ఆది దంపతుల నదీ విహారం నయననాందంగా సాగింది. బాలబ్రహ్మేశ్వరస్వామి వారు మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో జోగుళాంబ అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి ఆలయంలో విశేష సమర్పణలు అందజేసిన అర్చకులు నదీ విహారానికి పల్లకీలో బయల్దేరారు. ఎమ్మెల్యే విజయుడు, ఈఓ దీప్తి, పాలక మండలి చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రాంభూపాల్, పాలక మండలి సభ్యులు, అమ్మవారి దీక్ష స్వీకరించిన స్వాములు పల్లకీ సేవలో పాల్గొన్నారు. లోక రక్షకులు పుష్కరఘాట్‌కు చేరుకున్న అనంతరం అర్చకులు నదీ పూజ, నవక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను హంస వాహనంపై అర్చకులు కొలువుదీర్చి పూజలు చేశారు. మేళతాళాల నడుమ నదిలో మూడుసార్లు ప్రదక్షిణల అనంతరం హంస విహారం ముగిసింది. ఈ సందర్భంగా టపాసులు పేలుస్తూ ఆకాశాన్ని సైతం రంగురంగుల హరివిల్లుతో నింపేశారు. ఓవైపు విద్యుత్ కాంతులు, మరోవైపు టపాసుల పేలుళ్లతో తుంగభద్ర నది శోభాయమానంగా మారింది. హంసవాహన సేవ ప్రారంభానికి ముందు అర్చకులు పుష్కరఘాట్‌లో నదికి హారతులిచ్చారు. సీఐ రవిబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

కనువిందుగా తెప్పోత్సవం