
వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఎద్దుల బండి
● రెండు ఆవులు మృతి, ప్రాణాలతో
బయటపడ్డ దంపతులు
కోడేరు: వాగు ఉధృతికి రెండు ఎద్దులు మృతి చెందగా భార్యాభర్తలు ప్రాణపాయం నుంచి బయట పడిన ఘటన కోడేరు మండలం నాగులపల్లిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా.. గ్రామానికి చెందిన బోయ జక్కుల వెంకటస్వామి అతని భార్య అడివమ్మ ఉదయం రెండు ఆవులను బండికి కట్టుకొని వాగును దాటుతూ వ్యవసాయ పొలానికి వెళ్తున్నారు. ఉధృతంగా వాగు ప్రవహించడంతో బండి గుంతలో ఇరుక్కు పోయింది. రెండు ఎద్దులు అక్కడిక్కడే మృతిచెందాయి. భార్యాభర్తలు ఇద్దరు చెట్లను పట్టుకొని బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చనిపోయిన ఆవులను తాళ్ల సహాయంతో బయటకు తీశారు. దాదాపు రూ.లక్ష వరకు నష్టం జరిగిందని బాధితులు రోదించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.