
సిద్ధిధాత్రి.. కరుణించమ్మా
● తొమ్మిదో రోజు సిద్ధిధాత్రిగా జోగుళాంబ
● పట్టువస్త్రాలు సమర్పించిన
కర్నూలు కలెక్టర్
● రమణీయంగా జోగుళాంబ
అమ్మవారి రథోత్సవం
● ఆకట్టుకున్న కూచిపూడి
సాంస్కృతిక కార్యక్రమాలు
అలంపూర్: సకల సిద్ధులు ప్రసాదించే సిద్ధిధాత్రి నమోస్తుతే అంటూ భక్తులు జోగుళాంబ అమ్మవారిని శరణు కోరారు. అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల తొమ్మిదోరోజు మంగళవారం జోగుళాంబ అమ్మవారు సిద్ధిధాత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరూపాల్లో చివరిరోజు సిద్ధిధాత్రిగా దర్శనమిచ్చి అమ్మవారిని ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు అమ్మవారికి కుమారి పూజ, సువాసినిపూజ, మంత్రపుష్ప నీరాజనం, దశవిధ హారతులను అందజేశారు. శరన్నవరాత్రుల్లో చివరిరోజు జోగుళాంబ అమ్మవారిని సిద్ధిధాత్రిగా ఆరాధిస్తారని అర్చక స్వాములు తెలిపారు. సకల సిద్ధులను ప్రసాదించే ఆ జగన్మాత సిద్ధిధాత్రిగా దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీరుస్తుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసంగా తెలిపారు. నవదుర్గలలో ఒకరైన సిద్ధిధాత్రిని ఆరాధించడంతో శరన్నవరాత్రుల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులకు వివరించారు. ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. కుంకుమార్చనలు, చండీహోమాలు, అభిషేకాలు, అర్చనలు, నిత్యహోమాలు, శ్రీచక్రార్చనలు, ఖడ్గమాల అర్చనలు, నవారణ అర్చనలు ప్రత్యేకంగా జరిగాయి. అనంతపూర్‌కు చెందిన అమృత కూచిపూడి డ్యాన్స్ అకాడమీకి చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
క్షేత్రంలో రథోత్సవం
దసర ఉత్సవాల్లో భాగంగా జోగుళాంబ అమ్మవారి రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో రథాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. అనంతరం జోగుళాంబ మాత ఉత్సవ విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చారు. అర్చక స్వాములు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చక స్వాములు గుమ్మడికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారికి జేజేలు పలుకుతూ రథాన్ని ముందుకు నడిపించారు. రథోత్సవ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు
జోగుళాంబ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను కర్నూల్ కలెక్టర్ సిరి అందజేశారు. ప్రతిఏడాది నవరాత్రి ఉత్సవాల్లో ఏపీ ప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలను అందజేయడం అనవాయితీ. అందులో భాగంగా కర్నూల్ కలెక్టర్ సిరి, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ సుధాకర్‌రెడ్డి అలంపూర్ క్షేత్రానికి చేరుకున్నారు. ఈఓ దీప్తి వారికి స్వాగతం పలికారు. పట్టువస్త్రాలను శిరస్సున ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చక స్వాములు తీర్థప్రసాదాలను అందజేసి వేదాశీర్వచనం చేశారు. వీరితోపాటు పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు.

సిద్ధిధాత్రి.. కరుణించమ్మా

సిద్ధిధాత్రి.. కరుణించమ్మా

సిద్ధిధాత్రి.. కరుణించమ్మా

సిద్ధిధాత్రి.. కరుణించమ్మా