
జంగిల్ సఫారీ పునఃప్రారంభం
మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో జంగిల్ సఫారీ బుధవారం పునఃప్రారంభం అవుతుందని మన్ననూర్ ఎఫ్‌ఆర్‌ఓ వీరేష్ తెలిపారు. వన్యప్రాణుల బ్రీడింగ్ సమయం అయినందున వాటి స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని మూడు నెలలపాటు (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) సఫారీ మూసి ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 1వ తేదీ మొదలుకొని ప్రతినిత్యం సఫారీ వాహనాలు సంబంధిత అటవీశాఖ అధికారులు నిర్దేశించిన ప్రాంతాలలో తిరుగుతాయని పేర్కొన్నారు. పర్యాటకులు సఫారీలో ఉన్న క్రమంలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రతి వాహనం వెంట అనుభవజ్ఞులైన నేచర్ గైడ్స్ ఒకరు అందుబాటులో ఉండి వన్యప్రాణులు, అరుదైన వృక్షజాలం గురించి వివరిస్తారని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అడవులు ఆకుపచ్చ రంగులో ఆహ్లాదంగా ఉండటంతోపాటు అధికంగా పెరిగిన వన్యప్రాణులు ముఖ్యంగా పెద్దపులులు దారిలో కనిపించి సఫారీ ట్రిప్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. ఫర్హాబాద్, గుండం, అక్కమ్మదేవి గుహలు వంటి నిర్ణీత ప్రదేశాలలో సఫారీ ప్రయాణం కొనసాగుతుందన్నారు. సఫారీ వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, సఫారీ రైడ్ కోసం ఒకరు రూ.2 వేల చొప్పున చెల్లించాలన్నారు. వాహనంలో ఏడుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. సఫారీ ప్రయాణం చేయాలనుకునేవారు జ్ట్టి ఞట: //్చఝట్చ ఛ్చఛ్టీజీజ్ఛటట్ఛట్ఛటఠ్ఛి.ఛిౌఝ/ వెబ్‌సెట్‌ను సంప్రదించాలని సూచించారు. సఫారీ ట్రిప్‌లో ఉన్న పర్యాటకులు ప్లాస్టిక్, చెత్తాచెదారం అటవీ ప్రాంతంలో వేయకూడదని, అలాగే వన్యప్రాణులకు ఎలాంటి ఆహారం అందించకూడదని కోరారు.

జంగిల్ సఫారీ పునఃప్రారంభం