
ఆది దంపతుల కల్యాణం
కమనీయం..
● పట్టువస్త్రాలు సమర్పించిన
దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
● భారీగా తరలివచ్చిన భక్తులు..
కిక్కిరిసిన ఆలయ పరిసరాలు
అలంపూర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఎనిమిదో రోజు మూల నక్షత్రం పురస్కరించుకొని అలంపూర్ ఆలయాల్లో జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనులపండువగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ రామయ్యర్, ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారు, స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో మంగళవాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు కల్యాణ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి వివిధ ప్రాంతాల భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
పూర్ణకుంభంతో స్వాగతం..
అలంపూర్‌కు వచ్చిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్, ఎమ్మెల్యే విజయుడికి ఆలయ ఈఓ దీప్తి, కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శి స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలను తలపై ఉంచుకొని అమ్మవారి ఆలయాలకు చేరుకొని సమర్పించి కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ ఈఓ, పాలక మండలి సభ్యులు మంత్రికి పట్టువస్త్రాలు, జ్ఞాపిక అందజేశారు. వీరి వెంట జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రాంభూపాల్, కాంగ్రెస్ నాయకులు, భక్తులు ఉన్నారు.
మహాగౌరిగా దర్శనం..
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఎనిమిదోరోజు జోగుళాంబ అమ్మవారు మహాగౌరిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. అర్చకులు అమ్మవారికి కొలువు, కుమారి, సువాసిని పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు చతుర్భుజాలు కలిగి ఉంటారని.. కుడి వైపు త్రిశూలం, అభయ హస్తం, ఎడమ వైపు ఢమరుకం, వరద ముద్ర ఆశీస్సులిస్తూ భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు వివరించారు. అత్యంత శాంతమూర్తి అని.. ఈ మాతను ఆరాధించడంతో పాపాలు నశిస్తాయని, కష్టాలు తొలగుతాయని, సకల సౌభాగ్యాలతో పాటు మంగళం చేకూరుతుందని, కల్యాణప్రాప్తి కలుగుతుందని చెప్పారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో తరలి రావడంతో ఆలయాలు కిటకిటలాడాయి.

ఆది దంపతుల కల్యాణం