
పెళ్లి బృందం వాహనం బోల్తా
● ప్రమాద సమయంలో 59 మంది
● 12 మందికి తీవ్రగాయాలు,
కర్నూలుకు తరలింపు
● ఇటిక్యాలపాడు శివారులో
జాతీయ రహదారిపై ఘటన
ఉండవెల్లి: నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగా పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం బోల్తాపడిన సంఘటన మండలంలోని ఇటిక్యాలపాడు శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన పెళ్లి కుమార్తె బంధువులు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో పెళ్లి కుమారుడి ఇంటికి సోమవారం వలిమా వేడుకల కోసం 59 మంది డీసీఎంలో వచ్చారు. రిసెప్షన్ అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమవగా.. ఇటిక్యాలపాడు శివారులో జాతీయ రహదారిపై పంక్చర్ కావడంతో లారీ ఆగి ఉండగా.. వేగంగా వచ్చిన డీసీఎం సడెన్ బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కన అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎంలో ఉన్న చిన్నారులు, పెద్దలు, మహిళలు పెద్దగా కేకలు వేయడంతో ఇతర వాహనదారులు వచ్చి వారిని బయటికి తీశారు. ఇందులో 12 మందికి తీవ్రగాయాలు కావడంతో రెండు 108 అంబులెన్స్‌లలో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. డీసీఎం కింది బాగానా ఇద్దరు ఇరుక్కోగా.. క్రేన్ సహాయంతో బయటికి తీశారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలను ఎస్‌ఐ శేఖర్, హైవే సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.