
సంగమ క్షేత్రం.. జల దిగ్బంధం
● ఉగ్రరూపం దాల్చిన కృష్ణా,
భీమా నదులు
● దత్త భీమేశ్వరాలయంలోకి
చేరిన వరద
కృష్ణా: మండలంలోని కృష్ణా, భీమా నదులు ఉగ్రరూపం దాల్చాయి. రెండు రోజులుగా ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతితో సోమవారం కృష్ణా మండలం తంగిడి సమీపంలోని సంగమ క్షేత్రంలో ఉన్న దత్త భీమేశ్వరాలయం జలదిగ్బంధనమైంది. కృష్ణా, భీమా నదీతీరంలోని గ్రామాల సమీపంలోకి వరద చేరుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజులుగా కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, భీమా నదిపై ఉన్న సన్నత్తి, చిత్తాపూర్, యాద్గీర్, గూడూర్ బ్యారేజీల నుంచి 5.70లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణా, భీమా నదులకు వరద ఉధృతి పెరిగింది. దీంతో కృష్ణా మండలంలోని వాసుగనగర్, హిందూపూర్, గుర్జాల్ గ్రామాలతో పాటు ముడుమాల్, కృష్ణా, తంగిడి, సూకూర్ లింగంపల్లితో పాటు మాగనూర్, మక్తల్ మండలాల్లోని పలు గ్రామాలకు వరద ముంపు ముప్పు పొంచి ఉంది. వరద ఏమాత్రం పెరిగినా నదీ తీరంలోని గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధనమయ్యే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.