
పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలి
జడ్చర్ల: పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోలేపల్లి సెజ్‌లో ఓ పరిశ్రమను పంజాబ్ డిప్యూటీ మాజీ సీఎం సుఖ్జిందర్‌సింగ్ రందావాతో కలిసి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావడం శుభపరిణామమని, పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చలువతో పోలేపల్లి సెజ్ ఏర్పాటైందని, అప్పుడే పరిశ్రమల స్థాపనకు పునాది పడిందని గుర్తుచేశారు. అదే ఒరవడితో జడ్చర్ల ప్రాంతానికి అనేక పరిశ్రమలు తరలివచ్చాయని, పారిశ్రామిక రంగానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలకు సంబంధించి సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని పరిశ్రమల యాజమాన్యాలను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ రాజేందర్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, నాయకులు నిత్యానందం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.