
ప్రాజెక్టుల వద్ద జలసవ్వడి
● జూరాలకు 2.41లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● ప్రాజెక్టు 35 క్రస్టుగేట్ల ఎత్తివేత
ధరూరు/దేవరకద్ర/మక్తల్/రాజోళి/ఆత్మకూర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టుల వద్ద జలసవ్వడి నెలకొంది. శుక్రవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 2.41లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు అధికారులు 35 క్రస్టుగేట్లను ఎత్తి 2,40,450 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 26,817 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 69 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,67,336 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.241 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
738.558 ఎం.యూ. విద్యుదుత్పత్తి
ప్రియదర్శిని జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 367.696 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 738.558 ఎం.యూ. విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు.
కోయిల్‌సాగర్‌లో 7 గేట్లు ఎత్తివేత..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో 7 గేట్లను ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. మిగతా 8 గేట్లపై నుంచి కూడా నీరు జాలువారింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిగి, కొడంగల్, కోస్గి ప్రాంతాల నుంచి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ కోయిల్‌సాగర్‌కు చేరుతోంది. ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోకు సమానంగా ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఈఈ ప్రతాప్ సింగ్ తెలిపారు. కాగా, కోయిల్‌సాగర్ నుంచి బండర్‌పల్లి వరకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చిన్నచింతకుంట మండలం కురుమూర్తి దేవస్థానం వరకు వాగుపై ఉన్న చెక్‌డ్యాంలన్నీ పొంగి పొర్లుతున్నాయి.
సంగంబండలో 2 గేట్ల ద్వారా..
మక్తల్ మండలం సంగంబండలోని చిట్టెం రాంరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రం ఇడ్లూర్ పెద్దవాగు నుంచి నీటి ప్రవాహం అధికంగా వస్తుందని.. అందుకు అనుగుణంగా రిజర్వాయర్ గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు డీఈ సురేశ్ తెలిపారు.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి 7 గేట్ల ద్వారా దిగువకు పారుతున్న నీరు

ప్రాజెక్టుల వద్ద జలసవ్వడి