
స్కందమాత.. నమోస్తుతే
● అలంపూర్ ఆలయాల్లో ఘనంగా కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు
● శుక్రవారం కావడంతో పెరిగిన రద్దీ
● దర్శించుకున్న ప్రముఖులు
అలంపూర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు శుక్రవారం దక్షిణకాశీ అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపంలో రోజు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్చక స్వాములు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, నవావరణ, సహస్రనామ అర్చనలు, చండీహోమాలు నిర్వహించడంతో పాటు మహా నివేదన, మహా మంగళహారతులిచ్చారు. స్కందమాత అమ్మవారికి కుమారి పూజ, సువాసిని పూజ విశేషంగా నిర్వహించారు. స్కందమాతను ఆరాధించడంతో షడ్గుణాలు, సత్ప్రవర్తనలు సిద్ధిస్తాయని అర్చకులు వివరించారు. నవరాత్రుల్లో ఐదోరోజు అమ్మవారిని స్కందమాతగా పూ జించడంతో ఒడిదుడుకులు తొలగిపోతాయన్నారు.
సాంస్కృతిక ప్రదర్శన
అలంపూర్ క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌కు చెందిన సాయి సన్నిధి కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్య ప్రదర్శన భక్తులను ఆహ్లాదపరిచాయి. ఉత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆలయాల్లో భక్తుల రద్దీ..
నవరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజు ఓ విశేషమైతే.. అమ్మవారికి శుక్రవారం ప్రత్యేకరోజు కావడంతో భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయక తరలివచ్చారు. ఆలయాల్లో కొనసాగుతున్న కుంకుమార్చనలు, అభిషేకాలు, అర్చనలు, చండీహోమాల్లో పాల్గొన్నా రు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు.