
బాలుడి శ్వాసనాళంలో సీతాఫలం గింజ
పాలమూరు: సీతాఫలం గింజ శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన బాలుడి ప్రాణాలు కాపాడింది ఎస్‌వీఎస్ వైద్య బృందం. పూర్తి వివరాలు.. తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన రవీందర్‌రెడ్డి, నిర్మల మూడేళ్ల కుమారుడు హర్షవర్ధన్ శుక్రవారం సీతాఫలం తింటున్న క్రమంలో ప్రమాదవశాత్తు గింజ గొంతులోకి జారిపోవడంతో శ్వాస తీసుకోవడానికి అవస్థలు పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తరలించడంతో చిన్న పిల్లల విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ శైలజ, ప్రొఫెసర్ సోరేన్ సిటీస్కాన్ చేసి శ్వాసనాళంలో సీతాఫలం గింజ ఇరుక్కుపోయి ఊపిరితిత్తులు మూసుకుపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు తుమ్మూరు వెంకటేశ్వరరెడ్డి అత్యాధునిక పద్ధతి రిజిడ్ బ్రాంకోస్కోపీ ద్వారా శ్వాసనాళం నుంచి సీతాఫలం గింజ వెలికి తీశారు. క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందానికి బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. చికిత్సలో వైద్య నిపుణులు శరత్‌చంద్ర, రాజశేఖర్, సుమ్మయ్య, ఐశ్వర్య, నమ్రత, స్వాతి, కమల్, వీణామేరి, సౌమ్య, చైతన్య పాల్గొన్నారు.
చికిత్స చేసి తొలగించిన వైద్యులు