
గిరిపుత్రులకు ఆరోగ్య రక్ష
మన్ననూర్: నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని అడవి బిడ్డల కోసం తరచుగా ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలు ఆరోగ్య రక్షగా నిలుస్తున్నాయి. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అనుకూలించని వాతావరణంతో ఇబ్బందులు పడుతున్న ఆదివాసి చెంచులు తరచుగా అనేక వ్యాధులభారిన పడుతుంటారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన పీఎం జన్‌మన్, స్వస్త్‌నారీ పరివార్ అభియాన్‌తోపాటు అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, పదర, వటవర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయూష్, సంచార వైద్య శిబ్బంది ఆధ్వర్యంలో అప్పాపూర్, భౌరాపూర్, మల్లాపూర్, కొమ్మెన్‌పెంట తదితర 11లోతట్టు ప్రాంత చెంచు పెంటలు ఉన్నాయి. ఆయా చెంచు పెంటల్లో నెలలో రెండు మూడుసార్లు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ చెంచుల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తున్నారు. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో 108, 102, ఆర్‌వీఎం వంటి అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాయి.
పీఎం జన్‌మన్, స్వస్త్‌నారీ పరివార్‌తో వైద్యసేవలు
నెలలో రెండుమూడుసార్లు శిబిరాల నిర్వహణ
చెంచుల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తున్న వైనం
వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు
ఆయా చెంచు పెంటలు, గూడాలలోని ప్రజలకు సీజన్‌కు సంబంధించిన ఎలాంటి అంటువ్యాధులు ప్రభలకుండా ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. అదేక్రమంలో మన్ననూర్, అమ్రాబాద్, పదర, వటువర్లపల్లి ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. – రవికుమార్, డీఎండీహెచ్‌ఓ నాగర్‌కర్నూల్