
మెనూ ప్రకారం భోజనం అందించాలి
రాజాపూర్(బాలానగర్): విద్యార్థులకు చదువుతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ విజయేందిర సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం బాలానగర్ లోని గురుకుల పాఠశాల(బాలికలు), జెడ్పీహెచ్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని కిచెన్‌షెడ్‌ను, విద్యార్థుల కోసం తయారుచేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. పురుగుల అన్నం నీళ్ల చారు పెడుతున్నారని, వండిన అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాగా.. సివిల్ సప్లయ్ శాఖ నుంచి పాఠశాలకు సరఫరా చేసిన బియ్యంలో పురుగులు ఉన్నట్లు కలెక్టర్ గమనించారు. ఈ బియ్యాన్ని ఇక్కడి నుంచి వెంటనే తరలించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అనంతరం పదో తరగతి క్లాస్‌రూంలోకి వెళ్లి ఒక్కొక్క విద్యార్థితో మాట్లాడి.. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాగా చదువుకొని మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. గతేడాది పాఠశాల ఫలితాలు ఎలా ఉన్నాయని సిబ్బందితో ఆరా తీశారు.