
స్టేట్‌హోంలోవసతులపై ఆరా
పాలమూరు: జిల్లాకేంద్రంలోని స్టేట్‌హోంను శుక్రవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సందర్శించారు. స్టేట్‌హోంలో చిన్నారులకు అందుతున్న భోజనం, తాగునీరు, ఇతర వసతి సౌకర్యాలు పరిశీలించారు. ఆనంతరం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించి పలు రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం జువైనెల్ జస్టిస్ బోర్డును సందర్శించి స్థానికంగా ఉన్న పిల్లల ఆరోగ్యంపై ఆరా తీశారు. కార్యక్రమంలో న్యాయమూర్తి మమతారెడ్డి పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జడ్చర్ల టౌన్: మారుమూల గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జడ్చర్ల జూనియర్ సివిల్ జడ్జి నిహారిక పిలుపునిచ్చారు. శుక్రవారం నెక్కొండ గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్, పోక్సో చట్టం, సైబర్ క్రైమ్‌లపై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన ఉంటే మనం బాధ్యతాయుత పౌరులుగా మారగలమన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోలేని పేదల కు న్యాయసేవాసంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదులను నియమించి న్యాయం అందిస్తామన్నారు. పాఠశాలల నుంచే పిల్లలకు చట్టాల ప్రాముఖ్యత, పౌరహక్కులు, బాధ్యత లు తెలుసుకోవాలని సూచించారు.ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ మాధురి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాలిక్ షాకీర్, ఎస్‌ఐ అక్షయ్‌కుమార్, న్యాయవాదులు విశ్వేశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్, సాహితీరెడ్డి, పురుషోత్తంరావు, పాండుకుమార్, పంచాయతీ కార్యదర్శి నసీరోద్దిన్ పాల్గొన్నారు.
మహిళల భద్రతకు
ప్రత్యేక చర్యలు అవసరం
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం పోలీసులు చేపట్టే ప్రతి చర్యలో భరోసా, షీటీం, ఏహెచ్‌టీయూ, కళాబృందాలు కీలక పాత్ర పోషించాలని సీఐడీ ఎస్పీ అన్యోన్య అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలోమాట్లాడారు. సమాజంలో మైనర్ డ్రైవింగ్, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, గృహహింస, మహిళలపై దాడులు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలను కట్టడి చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తల్లిదండ్రులకు, యువతకు ఇలాంటి అంశాల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ అవసరం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐడీ సీఐ లక్ష్మణ్, ఉమెన్ పీఎస్ సీఐ శ్రీనివాస్, ఇతర ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
23న సాహితీ పురస్కారాల ప్రదానం
స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు, ప్రమీలశక్తి పీఠం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాకేంద్రంలోని భారత్ స్కౌట్స్ గైడ్స్ కార్యాలయంలో సాహితీ పురస్కారాల ప్రదానం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ కవి గంటా మనోహర్‌రెడ్డికి, పాకాలా యశోధారెడ్డి పురస్కారాన్ని తెలంగాణ జానపద సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ చింతపల్లి వసుంధరారెడ్డిలకు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. అలాగే అదే రోజు సాయంత్రం 6 గంటలకు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని తెలిపారు.

స్టేట్‌హోంలోవసతులపై ఆరా