
జూరాలకు మళ్లీ భారీగా వరద
● 20 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు
నీటి విడుదల
ధరూరు/ఆత్మకూర్/రాజోళి: ప్రియదర్శిని జూరా ల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం భారీగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 1,18,500 క్యూసె క్కులు ఉండగా.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1.73 లక్షల క్యూసెక్కులకు చేరిందన్నారు. దీంతో ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను పైకెత్తి 1,42,180 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. విద్యుదుద్పత్తి నిమిత్తం 34,879 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 47, భీమా లిఫ్ట్–1కు 650, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 600, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.070 టీఎంసీలు ఉందన్నారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. బుధవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 338.100 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 362.935 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని వివరించారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 701.035 మి.యూ. విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.
సుంకేసులకు 30 వేల క్యూసెక్కులు..
సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి స్వల్పంగా వరద వస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం 30,450 క్యూసెక్కుల వరద రాగా.. ఆరు గేట్లను మీటరు మేర తెరిచి 26,472 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులు వదిలినట్లు వివరించారు.