సంక్షేమ పథకాల అమలుతోప్రజలు సంతోషంగా ఉన్నారు
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హామీలు అమలు చేస్తాం
విద్య, స్పోర్ట్స్, పర్యాటక అభివృద్ధికి పెద్దపీట
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజా పాలన దినోత్సవంలో కలెక్టరేట్‌పై జెండావిష్కరణ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పు చేస్తే.. వాటికి ప్రతినెలా రూ.వేల కోట్ల మిత్తి చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందేలా చూస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అమరుల ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2.45 కోట్ల మంది మహిళలు జీరో బిల్లు వినియోగించుకున్నారని, 1,02,658 మంది వినియోగదారులకు 3.85 లక్షల గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేశామన్నారు. ప్రతినెలా 200 యూనిట్ల విద్యుత్ కోసం 1,32,931 జీరో బిల్లు జారీ చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచిన ప్రభుత్వం తమదేనన్నారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా రూ.552 కోట్ల అంచనా వ్యయంతో 11,037 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు.

అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి