
డ్రంకెన్ డ్రైవ్ కేసులో వినూత్న తీర్పు
మహబూబ్‌నగర్ క్రైం: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుడికి న్యాయమూర్తి వినూత్నంగా శిక్ష విధించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు గత నెల 24న జిల్లాకేంద్రం సమీపంలోని బోయపల్లి మార్గంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టణంలోని మోతీనగర్‌కు చెందిన రాఘవేందర్ మద్యం తాగి ద్విచక్రవాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో మంగళవారం వాహనదారుడు రాఘవేందర్‌ను కోర్టులో హాజరుపరచగా 2వ తరగతి కోర్టు స్పెషల్ న్యాయమూర్తి డి.నిర్మల వాహనదారుడికి రెండు రోజుల సామాజిక సేవతోపాటు రూ.2 వేల జరిమానా విధించారు. సామాజిక సేవలో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపితే వచ్చే అనర్థాలపై ప్లకార్డులు పట్టుకొని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు అవగాహన కల్పించాలని తీర్పు చెప్పారు. ఈ మేరకు మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు రాఘవేందర్‌తో జిల్లాకేంద్రంలోని సుభాష్‌చంద్రబోస్ చౌరస్తాలో ప్లకార్డులు ప్రదర్శింపజేశారు.