
సమయాన్ని వృథా చేసుకోవద్దు
నాగర్‌కర్నూల్: విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎంపీ మల్లురవి అన్నారు. పట్టణంలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో సీఎస్‌ఆర్ నిధులతో ఎస్‌బీఐ బ్యాంక్ సౌజన్యంతో రూ.6.70 లక్షలతో నిర్మించిన మూత్రశాలలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో స్టోర్ రూం, మెనూ చార్టు పరిశీలించారు. ఎంపీకి ఆహార నాణ్యతపై వివరాలను ప్రిన్సిపాల్ వివరించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఎంపీ సహపంక్తి భోజనం చేస్తూ వారితో ముచ్చటించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఎంపీ వివరించారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. అందుకు అనుగుణంగానే మెస్ చార్జీలను 40 శాతం పెంచిందన్నారు. విద్యాభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఈ దృష్టితోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీ సుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు మావిళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌మూర్తి, బ్యాంక్ అధికారులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.