
వీరభద్రా.. మంగళం
● మన్యంకొండలో వైభవంగా అగ్నిగుండ
మహోత్సవం
● ముగిసిన వీరభద్రస్వామి ఉత్సవం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న శ్రీవీరభద్రస్వామి అగ్నిగుండం కార్యక్రమం మంగళవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా దేవస్థానం ఎదుట అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి సంకీర్తనలు ఆలపిస్తూ నందికోళ సేవ చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహంతో దేవస్థానం నుంచి సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు చేశారు. తిరిగి స్వామిని దేవస్థానం ఎదుట ఉన్న అగ్నిగుండం ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అగ్నిగుండంపై నడిచి భక్తిని చాటుకున్నారు. అనంతరం అగ్ని గుండానికి మహా మంగళహారతి పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.