
4 దశాబ్దాలుగా ఉద్యమంలోనే..
● మోస్ట్ వాంటెడ్ మావో అగ్ర నాయకురాలు సుజాతక్క లొంగుబాటు
● కేంద్ర కమిటీ సభ్యురాలిగా, మావో
అగ్రనేత కిషన్‌జీ భార్యగా గుర్తింపు
● ఆమైపె మొత్తం 106 కేసులు,
రూ.కోటి రివార్డు
● బాల్యమంతా స్వగ్రామం పెంచికలపాడు, అయిజలోనే గడిపిన వైనం
గట్టు: మావోయిస్టు పార్టీ అగ్ర నాయకురాలు పోతుల పద్మావతి.. 19 ఏళ్ల వయసులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న క్రమంలో రాడికల్స్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితురాలై అడవిబాట పట్టారు. 43 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ.. ఛత్తీస్‌గడ్ సౌత్‌సభ జోనల్ బ్యూరో ఇన్‌చార్జిగా, పార్టీ కేంద్ర కమిటీలో ఏకై క మహిళా సభ్యురాలి స్థాయికి ఎదిగారు. ఎన్నో ఎన్‌కౌంటర్లలో త్రుటిలో తప్పించుకున్నారు. ఈమైపె 106 కేసులు, రూ.కోటి రివార్డు ఉంది. నక్సల్ ఉద్యమంలో చేరిన నాటి నుంచి ఏనాడు స్వగ్రామం పెంచికలపాడు, విద్యనభ్యసించిన అయిజ వైపు తిరిగి చూడలేదు. అల్లారుముద్దుగా చూసుకున్న తండ్రి ఆమైపె బెంగతో మృతిచెందగా.. ఒకే ఒక్కసారి స్వగ్రామానికి రహస్యంగా వచ్చి వెళ్లారు. ‘ఏదో ఒకరోజు ఎన్‌కౌంటర్‌కు గురవుతుంది అన్న వార్త వింటామేమో’ అని ఆశలు వదులుకున్న తల్లి, అన్నదమ్ముల్లో.. లొంగిపోయింది అన్న విషయం తెలియడంతో ఆనందం వెల్లివిరిసింది. ఆమె రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
● పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ సుజాతక్క శనివారం ప్రభుత్వం ఎదుట లొంగిపోయిందన్న వార్త జోగుళాంబ గద్వాల జిల్లాలో చర్చాంశనీయాంశమైంది. గట్టు మండలం పెంచికలపాడుకి చెందిన తిమ్మారెడ్డి, వెంకమ్మ దంపతుల రెండో సంతానం పోతుల పద్మావతి. అయితే రవాణా సౌకర్యాలు ఏమాత్రం లేని పెంచికలపాడు నుంచి అయిజలో ఉంటున్న స్వాతంత్య్ర సమరయోధుడు, తాతయ్య అయిన రామిరెడ్డి ఇంటికి అప్పట్లో మకాం మారారు. పద్మావతి అక్కడే ఉంటూ 10వ తరగతి, గద్వాలలోని మహారాణి ఆది లక్ష్మీదేవమ్మ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న క్రమంలోనే రాడికల్స్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితురాలయ్యారు. చివరికి 1983లో నక్సల్ ఉద్యమంలో చేరి అటు నుంచే అటే అడవి బాట పట్టారు. ఏనాడు ఇటు వైపు తిరిగి చూడలేదు. అయితే కూతురిపై ఎక్కువ ప్రేమను పెంచుకున్న కన్నతండ్రి తిమ్మారెడ్డి పద్మావతి న క్సల్స్ వైపు వెళ్లిపోవడంతో ఏడాది మృతి చెందిన ట్లు గ్రామస్తులు తెలిపారు. తండ్రి మృతి చెందిన ఏ డాది తర్వాత ఒక రోజు రహస్యంగా స్వగ్రామానికి వచ్చి వెళ్లిన ఆమె మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు.
కిషన్ జీ భార్యగా..
పద్మావతి మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. మావో అగ్రనేత కిషన్‌జీని వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియడం లేదు. అనేక పర్యాయా లు ఎన్‌కౌంటర్లు జరిగినప్పటికీ పద్మావతి చాకచక్యంగా తప్పించుకున్నారు. 2011 లో కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తరుణంలో పోతుల పద్మావతి గురించి తెరపైకి చర్చ వచ్చింది.
పాత తరం వారికే గుర్తు..
పెంచికలపాడుకి చెందిన పద్మా వతి గురించి కేవలం అప్పటి పాత తరం వారికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే పద్మావ తి గురించి తెలుసని చెబుతున్నారు. 1983లో నక్సల్స్ ఉద్య మంలోకి వెళ్లిన పోతుల పద్మావతి మళ్లీ ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం ఒకే ఒక్క సారి తండ్రి చనిపోయిన ఏడాది తర్వాత రహస్యంగా ఇక్కడి వచ్చి వెళ్లింది. అయితే పద్మావతి బాల్యం మొత్తం అయిజలోనే గడిపిందని, సెలవులు ప్రకటించిన సందర్భంలో పెంచికలపాడుకి వచ్చేదని గ్రామ పెద్దలు తెలిపారు.
కుటుంబసభ్యుల్లో ఆనందం
మావోయిస్టు పద్మావతి హైదరాబాద్‌లో డీజీపీ ఎదుట లొంగిపోయిందన్న వార్త టీవీల్లో చూసి ఆమె కుటుంబసభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 84 ఏళ్ల పద్మావతి తల్లి వెంకమ్మకు మాత్రం తన కూతురు పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం సాయంత్రం దాకా తెలియదని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే కూతురి కోసం ఎదు రుచూస్తూనే ఉందని వారు తెలిపారు. సోదరులు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, హనుమంతురెడ్డి, సోదరి హేమలత పద్మావతి రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒకానొక సందర్భంలో నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లిన పోతుల పద్మావతి ఏదో ఒక రోజున ఎన్‌కౌంటర్‌కు గురవుతుందని భావిస్తున్న తరుణంలో.. పోలీసుల ఎదుట లొంగిపోవడంపై ఇటు కుటుంబ సభ్యులు, అటు పెంచికలపాడు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.