
పట్టుకోండి.. చూద్దాం
మక్తల్: పట్టణంలో రోజురోజుకు దొంగల బెడద అధికం కావడంతో ప్రజలకు కునుకు పట్టడంలేదు. రాత్రయ్యిందంటే చాలు ఎవరూ బయటకు వెళ్లకుండా ఇంటి వద్దే కాపలా కాస్తున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం ఆరు బైకులను చోరీ చేశారు. తాజాగా రెండు వైన్స్ షాపులను లూటీ చేశారు. పట్టణంలోని 167వ అంతర్రాష్ట్ర రహదారి పక్కనున్న శాంతమ్మ వైన్స్ షట్టర్స్ ధ్వంసం చేసి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ. 3లక్షల నగదు, శేష వైన్స్‌లో రూ. 40వేలు నగదు చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం క్లూ టీంతో వివరాలు సేకరించారు. యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గత జూలై 11న పట్టణంలోని టీచర్స్ కాలనీలో చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి తాళం పగులగొట్టి 12 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.30వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు దొంగలను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. ఎల్లమ్మ కుంటలో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం సంగంబండ రోడ్డులో ఇళ్ల ఆవరణలో నిలిపిన 6 బైకులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై మక్తల్ పోలీసులకు యాజమానులు ఫిర్యాదు చేశారు. మక్తల్‌లో దొంగతనాలు అధికం కావడంతో కొందరు అద్దె ఇళ్లను ఖాళీ చేసి ఎక్కువమంది ఉన్న వద్దకు అద్దెకు తీసుకుంటున్నారు.