
న్యాయం చేయండి మహాప్రభో..
● తమ ప్లాట్లను ఆక్రమించుకునే
వారిపై చర్యలు తీసుకోవాలి
● వెంచర్ వద్ద బాధితుల ఆందోళన
అచ్చంపేట రూరల్: పట్టణంలోని రియల్ వ్యాపారులు అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నా రు. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న రియల్ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బాధితులు కథనం ప్రకారం.. పట్టణంలోని సర్వేనెంబరు 26లో 2009 ఏడాదిలో భూ యజమాని 49 మందికి పట్టాల రూపంలో ప్లాట్లను విక్రయించాడు. ఐదేళ్ల క్రితం ప్లాట్ల యజమానులకు తెలియకుండా భూ యజమాని అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశాడు. 2009లో లేని భూమిని 2019లో ఎలా సృష్టించారని బాధితులు ఆరోపించారు. పాత పాస్‌బుక్‌లో లేని వివరాలను కొత్తగా సృష్టించారన్నారు. ధరణి సాఫ్ట్‌వేర్‌లో రెవెన్యూ అధికారుల అండదండలతో తప్పుడు రికార్డులు సృష్టించి సర్వే నెంబర్ 27/1 అని కొత్తగా సృష్టించారన్నారు. భూ యజమానిపై మళ్లీ రికార్డులు సృష్టించినట్లు బాధితులు వాపోయారు. అంతేకాకుండా మరికొంత మంది పేరుమీద మారడం.. అది తప్పుగా ఉన్నట్లు జిల్లాస్థాయి అధికారులు నివేదికలు అందించారన్నారు.
వెంచర్ వద్ద బాధితుల ఆందోళన
తమకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా వెంచర్‌ను సృష్టించి పనులు చేస్తున్నారని శనివారం బాధితులు వెంచర్ వద్ద ఆందోళన చేశారు. 2009 సంవత్సరంలో కష్టపడి ప్లాట్లను కొనుగోలు చేశామని, చాలారోజులుగా తమను వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ప్లాట్లను కొనుగోలు చేసిన వారిలో గిరిజనులు, బుడగజంగాలు, పేదలే ఉన్నారని, గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధుల వద్దకు తమ సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తేల్చాల్సి ఉండగా.. కొందరు తమను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బాధితులకు అండగా ఉండాల్సిన కొన్నిశాఖల అధికారులు తమపైనే తప్పుడు కేసులు బనాయిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని, స్థానిక పోలీసులు కూడా కుమ్మక్కయ్యారని వాపోయారు. ఎస్‌ఐ విజయభాస్కర్ తమ సిబ్బందితో వెంచర్ వద్దకు వచ్చి బాధితులతో మాట్లాడారు. రెండురోజుల్లో ఇరువర్గాలను పిలిపించి సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తామన్నారు.