
జూరాలకు 1.15 లక్షల ఇన్‌ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుందని పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందన్నారు. దీంతో ప్రాజెక్టు 19 క్రస్టు గేట్లను ఎత్తి 74,081 క్యూసెక్కులు, జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 29,464 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 66 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు, భీమా లిఫ్టు– 2కు 750 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 700 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1.07 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.389 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
లక్ష్యానికి చేరువలో విద్యుదుత్పత్తి
జూరాల ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది 610 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం కాగా.. ఇది వరకే 305 ఎంయూ సాధించారు. ఆదివారం ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.
ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు
తగ్గిన ఇన్‌ఫ్లో...
ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 97.416 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 62,167 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. నారాయణపూర్ ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 30.130 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 65వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 15 క్రస్టు గేట్లను ఎత్తి జూరాలకు ప్రాజెక్టుకు 48,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలంకు నీటి ప్రవాహం
దోమలపెంట: జూరాల ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 74,081 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 29,464, సుంకేసుల నుంచి 35,296 మొత్తం 1,38,841 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం చేరుతోంది. శ్రీశైలం జలాశయంలో 882.7 అడుగుల వద్ద 202.9673 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,173 మొత్తం 67,488 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 20 వేల క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్టు ఇరిగేషన్ ద్వారా 1,013, ఎంజీకేఎల్‌ఐకు 516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.757 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 17.351 మి.యూనిట్లు విద్యుదుత్పత్తి చేశారు.
కొనసాగుతున్న వరద
సుంకేసులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 37 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఎనిమిది గేట్లు తెరిచి 37,263 క్యూసెక్కులను దిగువకు, కేసీ కెనాల్‌కు 2,354 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.