
రూ.6 వేల పింఛన్లు సాధిస్తాం: మందకృష్ణ మాదిగ
మహబూబ్‌నగర్ రూరల్/ధన్వాడ: దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. హామీలు అమలు చేయడం చేతకాకపోతే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట జిల్లా ధన్వాడలో ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగ చేయూత పింఛన్‌దారుల మహాగర్జన సన్నాహక సదస్సులకు ఆయన హాజరై మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచి ఇస్తున్నారని.. తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పింఛన్‌దారుల్లో ఒక్కొక్కరు రూ. 40వేలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వికలాంగుల బడ్జెట్ మొత్తం రుణమాఫీకి మళ్లించారని ఆరోపించారు. భూములు ఉన్నవారి అప్పులను తీరుస్తున్న ప్రభుత్వం.. కాళ్లు, చేతులు, మూగ, కళ్లు లేని వారికి మాత్రం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. పింఛన్ తీసుకునేది నూటికి 99 శాతం పేదలేనని.. రుణమాఫీపై ప్రశ్నించే ప్రతిపక్షాలు పెండింగ్ పింఛన్ల గురించి ఎందుకు అడగడం లేదని మండిపడ్డారు. పేదల కోసమే ప్రభుత్వం పనిచేయాలన్నారు. ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరిగే సభకు పెద్దఎత్తున తరలిరావాలని, ఎందుకు అమలు చేయరో తేల్చుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలువంచి దివ్యాంగులకు రూ. 6వేలు, వృద్ధులు, వితంతులు, గీత, చేనేత, బీడీ కార్మికులకు రూ. 4వేల చేయూత పింఛన్ సాధిస్తామని అన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ అందుతుందంటే.. ఎమ్మార్పీఎస్ ఆనాడు చేసిన ఉద్యమ ఫలితమేనని వివరించారు. అనంతరం ధన్వాడలోని ఎస్సీ హాస్టల్‌ను ఆయన పరిశిలించారు. కేవలం ఎనిమిది గదుల్లో 250 మంది విద్యార్థులు ఉండటం బాధాకరమని.. ఆ భవనం కూడా శిథిలావస్థకు చేరిందన్నారు. హాస్టల్‌కు నూతన భవనం నిర్మించాలని అన్నారు. కార్యక్రమాల్లో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షుడు బిచ్యానాయక్, జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు, ప్రధాన కార్యదరి శ్రీనివాసులు, వీహెచ్‌పీఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పద్మ, నాయకులు జైపాల్‌రెడ్డి, శ్రీలక్ష్మి, పారిజాత, వెంకటేశ్, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ర బిక్షపతి, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివ, నాయకులు శ్రీరాములు, రామచంద్రయ్య, నాగరాజు, వెంకటేష్, ఆంజనేయులు, ఉదయ్‌కిరణ్, రాము, తిమ్మయ్య, రాజన్న, చింతన్‌పువ్వు నర్సింహులు, నారాయణ, రాజు, గుర్రంరాజు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్
వ్యవస్థాపక అధ్యక్షుడు
మందకృష్ణమాదిగ