
గురుకుల విద్యార్థులకు వైరల్ ఫీవర్
పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 18మంది విద్యార్థులు విషజ్వరాల బారిన పడ్డారు. రెండు రోజుల నుంచి విద్యార్థులు తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం డాక్టర్ నారాయణస్వామి గురుకుల పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి.. విద్యార్థులకు అవసరమైన మందులు అందజేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అకుల్ తెలిపారు. కాగా, కొల్లాపూర్ మండలం కుడికిళ్లకు చెందిన 9వ తరగతి విద్యార్థి అభిషేక్ తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయితే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యిందని ప్రచారం జరగడంతో బీజేవైఎం నాయకులు లింగస్వామి, మార్కేండ య, శివ, తిరుమల్ తదితరులు గురుకులానికి చేరుకొని విద్యార్థులతో ఆరా తీశారు. తాము జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నామని.. ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదని తెలిపారు.
నీటికుంటలో వ్యక్తి గల్లంతు
బిజినేపల్లి: పశువులను మేపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీటికుంటలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గుడ్లనర్వకు చెందిన అయ్యన్న (53) రోజు మాదిరిగానే గేదెలను మేపేందుకు స్థానికంగా ఉన్న రావికుంట సమీపానికి వెళ్లాడు. సాయంత్రం గేదెలు కుంటలో పడగా.. వాటిని బయటికి వెళ్లగొట్టేందుకు గాను అయ్యన్న నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గురుకుల విద్యార్థులకు వైరల్ ఫీవర్