ప్రాజెక్టులకు భారీ వరద | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు భారీ వరద

Jul 8 2025 7:02 AM | Updated on Jul 8 2025 7:02 AM

ప్రాజెక్టులకు భారీ వరద

ప్రాజెక్టులకు భారీ వరద

ధరూరు: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో సోమవారం కొంత తగ్గిందని పీజేపీ అధికారులు తెలిపారు. లక్షా 12వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 79,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29,159 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్టు–1కు 1300, ఆవిరి రూపంలో 43 , ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 285, ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌కు 150 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 1.10లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.316 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.

ఆల్మట్టికి 1.11 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

అలాగే, ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 123.081 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 88.248 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1,11,472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 1,15,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 33.313 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 26.936 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1,15,00 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 30 క్రస్టు గేట్లను ఎత్తి ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న జూరాలకు ప్రాజెక్టుకు 1,12,577 క్యూసెక్కుల నీటిని దగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం నిండుకుండలా..

దోమలపెంట: ఎగువ ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయి చేరువలోకి వచ్చేస్తుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885.0 అడుగుల వద్ద 215.8070 టీఎంసీలు కాగా సోమవారం జలాశయంలో 880.8 అడుగుల నీటిమట్టం వద్ద 192.5300 టీఎంసీలుగా ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,118 మొత్తం 67,433 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.546 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.612 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు.

11 యూనిట్లలో విద్యుదుత్పత్తి

ఆత్మకూర్‌: జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుంచి వరద భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈమేరకు సోమవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు.

జూరాల వద్ద 12 క్రస్టు గేట్ల ఎత్తివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement