
జూరాల భద్రతకు చర్యలు
కృష్ణానదిపై అదనంగా హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి
క్షేత్రస్థాయి స్థలాల పరిశీలన
జూరాలకు దిగువ భాగాన కృష్ణానదిపై అదనంగా నిర్మించే హైలెవెల్ బ్రిడ్జి పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది. ఈనేపథ్యంలోనే బుధవారం ఆర్‌అండ్‌బీ శాఖ ఎస్‌ఈలు రాజేందర్, శివకుమార్ ఈఈ, డీఈలు, ఏఈలు, ఇరిగేషన్‌శాఖకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ధరూరు మండలం రేవులపల్లి, ఆత్మకూరు మండలం నందిమల్ల గ్రామాల మధ్య సుమారు 1.07 కిలో మీటర్ పొడవుతో నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు. అదేవిధంగా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు మండలం జూరాల మధ్యన సైతం బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు పరిశీలించారు. రెండుచోట్ల ఏదో ఒక ప్రాంతంలో హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
గద్వాల: ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తూ.. ఎన్నో ప్రాజెక్టులకు అవసరమైన నీటిని ప్రత్యక్షంగా, పరోక్షంగా అందిస్తూ.. సుమారు 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించి బీడు భూములను సస్యశ్యాలం చేస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జూరాల ప్రాజెక్టుకు కష్టం వచ్చిపడింది. 1996లో అందుబాటులోకి వచ్చిన తరువాత 30 ఏళ్ల కాలంలో ప్రాజెక్టు నిర్వహణను పాలకులు గాలికొదిలేశారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతు, భద్రతకు గుండెకాయ మాదిరిగా వ్యవహరించే గ్యాంటీ క్రేన్‌తోపాటు డ్యాంలోని సుమారు 26 గేట్లు నిర్వహణ లోపంతో దెబ్బతిని రిపేర్లకు గురయ్యాయి. వీటిని మరమ్మతు చేయాలనే ద్యాసే లేకుండా పోయింది. అదేవిధంగా ప్రాజెక్టుపై ఉన్న బ్రిడ్జి నుంచి భారీ లారీలు, బస్సులు, ఇతర వాహనాలు 24 గంటల పాటు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ప్రస్తుతం జూరాల బ్రిడ్జి ప్రమాదంలో పడింది. ఇదే విషయం ఏడేళ్ల కిందటే ప్రభుత్వానికి సంబంధిత అధికారులు నివేదిక పంపినా పట్టించుకోలేదు. ఇటీవల గేట్ల రోపులు తెగిపోవడం, ఆ విషయం కాస్తా మీడియాలో ప్రచురితమవడం, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతల సందర్శించడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది. దీంతో ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి అదనంగా మరో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఈమేరకు నిధులు మంజూరు చేయడంతో జూరాల పటిష్టతపై గట్టి చర్యలు మొదలయ్యాయి.
గేట్ల రోపులు తెగడంతో..
ఇటీవల ప్రాజెక్టుకు ముందస్తు వరద రావడంతో అప్పటికే రిపేర్లతో కొట్టుమిట్టాడుతున్న 26 గేట్లలో 4, 8వ నంబర్ల గేట్ల ఇనుప రోపులు తెగిపోయాయి. దీనిపై మీడియాలో ప్రముఖంగా కథనాలు ప్రచురితం కావడం, అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో జూన్ 28వ తేదీన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. గేట్లతోపాటు, బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను పరిశీలించారు. గతంలో అధికారులు పంపిన నివేదికల వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. దీనిపై మంత్రి ఉత్తమ్ జూరాల ప్రాజెక్టుపై స్పందిస్తూ అదనంగా మరో రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఇందుకోసం రూ.100కో ట్లు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈక్రమంలోనే ఈనెల 1వ తేదీన నూతన హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు రూ.121.92కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
రూ.121.92 కోట్లు మంజూరు
ఆర్‌అండ్‌బీకి నిర్మాణ పనుల
అప్పగింత
జూరాల, కొత్తపల్లి సమీపంలో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు