
ఆర్టీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ తనిఖీ
పాలమూరు: ఆర్టీఏ కార్యాలయంలో వరుస తనిఖీలతో ఉన్నతాధికారుల హల్‌చల్ చేస్తున్నారు.. ఇటీవల కలెక్టర్ విజయేందిర ఆకస్మిక తనిఖీ చేయగా.. కొన్ని రోజుల వ్యవధిలోనే తాజాగా శుక్రవారం మధ్యాహ్నం అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సైతం సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో ఆర్టీఏ కార్యాలయంలో నేరుగా వెళ్లిన వాహనదారుల పనులు కాకుండా ఏజెంట్ల ద్వారా వెళ్లిన వారి ఫైల్స్ త్వరగా పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతోపాటు లైసెన్స్‌ల జారీలో అవినీతి జరుగుతుందని సమాచారంతో అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. మొదట ఆఫీస్‌లోని సెక్షన్ విభాగానికి వెళ్లిన వెంటనే ఆఫీస్ డోర్లు మూసివేసి.. లోపల ప్రైవేట్ వ్యక్తులు (ఏజెంట్లు) ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. ఆ తర్వాత ఏఓ దగ్గర ఫైల్స్ పరిశీలించి క్యూలైన్‌లో ఉన్న వాహనదారులతో మాట్లాడారు. అలాగే డీబీఐ గదిలోకి వెళ్లి లైసెన్స్‌ల జారీ ఎలా జరుగుతుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లైసెన్స్‌లు ఫ్రింట్ చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం నూతన వాహనాలకు చెస్ నంబర్ తీయడం, డ్రైవింగ్ టెస్ట్ విధానాలను చూశారు. లైసెన్స్ జారీ విషయంలో గతంలో పోస్టాఫీస్ ద్వారా ఇవ్వకుండా కార్యాలయానికి వచ్చిన వాహనదారుడికి నేరుగా ఇవ్వడానికి కొంత అదనంగా నగదు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా ఏజెంట్లు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఒక్కో ఫైల్‌కు వాహనదారుల దగ్గర రెండింతల నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో ఆర్డీఓ నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.