
కలగానే కొత్త ఠాణాలు..!
గండేడ్: జిల్లాలో నూతన ఠాణాల ఏర్పాటు ఓ కొలిక్కి రావడంలేదు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, మండలాల విభజన జరిగింది. నూతనంగా ఏర్పాటైన మండలాల్లో అన్ని శాఖల కార్యాలయాలు విడివిడిగా ఏర్పాటు చేసినా.. పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు మాత్రం గ్రహణం వీడడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో 17 మండలాల్లో గండేడ్, కౌకుంట్ల మండలాలు నూతనంగా ఏర్పడ్డాయి. ఉమ్మడి గండేడ్ మండలం 75వేలకు పైగా జనాభా, 24 గ్రామపచాయతీలతో ఉండేది. 2020లో దీన్ని రెండు మండలాలుగా విభజించారు. ఈ రెండు మండలాల పరిదిలో కొత్త గ్రామపంచాయతీలను కూడా ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లో గతంలో 24కు బదులు 49 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. మహమ్మదాబాద్‌లో 22 గ్రామపంచాయతీలు ఉండగా గండేడ్‌లో 27 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. అప్పటి నుండి రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఎంపీడీఓ ఇతర శాఖలు రెండు మండలాలకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. కానీ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆవశ్యకత ఎంతో ఉన్న నూతన పోలీస్‌స్టేషన్లు మాత్రం కొత్త మండలాల్లో ఏర్పాటు కాలేదు.
ఉమ్మడి మండలానికి ఒకే పోలీస్‌స్టేషన్...
ఉమ్మడి మండలాలకు మహమ్మదాబాద్ పోలీస్‌స్టేషన్ ఒక్కటే ఉంది. కొత్త మండలాలు ఏర్పడ్డాక అవసరం ఉన్న మండలాలకు కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. కాని అది నేటికి కలగానే మిగిలింది. రెండు మండలాల భౌగోళిక స్వరూపం ఎక్కువగా ఉండడంతో పర్యవేక్షణ కొంత కష్టంగా ఉంది. తండాలు సైతం 45 వరకు ఉన్నాయి. అవి కూడా మెయిన్ రోడ్లకు దూరంగా ఉండడంతో అత్యవసర సమయాల్లో ఇక్కట్లు తప్పడం లేదు. ముఖ్యంగా గండేడ్ మండలంలోని గోవింద్‌పల్లి తండా, పీర్ల బండతండా, పగిడ్యాల్, పరుగుల తండా, జిన్నారం, జిన్నారం తండా, ఎల్మిల్లా పెద్దవార్వాల్, చిన్నవార్వాల్ తదితర గ్రామాలకు సకాలంలో సేవలు అందడం కష్టతరంగా మారింది. రాత్రివేళల్లో మహమ్మదాబాద్ నుంచి రావాలంటే ఇక్కట్లు ఎదుర్కోక తప్పడం లేదు. గతంలో కొన్నాళ్ల పాటు గండేడ్ మండల కేంద్రంలో ఔట్‌పోస్టు పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసినా తర్వాత దానిని ఎత్తేశారు. ఉమ్మడి పోలీస్‌స్టేషన్ అయిన మహమ్మదాబాద్‌లో కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. గతేడాది 316 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఆరు నెలల్లోపే కేసుల సంఖ్య 180కు చేరాయి. దేవరకద్ర నుంచి కొత్తగా కౌకుంట్ల మండలం కూడా ఏర్పాటైంది. ఈమండలానికి కూడా మిగతా కార్యాలయాలు వేరుగా ఏర్పడినా.. పోలీస్‌స్టేషన్ మాత్రం ఏర్పాటు కాలేదు. ఇదిలాఉండగా, పోలీస్‌స్టేషన్లు దూరంగా ఉండడంతో చోరీలు, ఇతర ఘటనలు జరిగిన సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లేలోపు దొంగలు, నిందితులు తప్పించుకుంటున్నారు.
నిమిషాల వ్యవధిలోనే దొంగలు పరార్..
గండేడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డును ఆనుకొని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకు ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏటీఎంలో చోరీకి దొంగల విఫలయత్నం చేశారు. రాత్రివేళల్లో ఏమైన అత్యవసరంగా డబ్బులు అవసరం అయితే తీసుకోవడానికి వీలుగా అక్కడ ఉన్న ఏటీఎంను ఎప్పుడూ తెరిచి ఉంచుతారు. గతేడాది ఆగస్టు 3వ తేదీ తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ముగ్గురు దొంగలు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ఓవైపు కట్‌చేశారు. ఇంతలోనే సంబంధిత బ్యాంకు మేనేజర్ శరత్‌చంద్రకు మెసేజ్ వెళ్లగా.. ఆయన వెంటనే ఏటీఎం ఉన్న ఇంటి ఓనర్‌కు, మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డికి ఫోన్‌చేసి సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకునే నిమిషాల వ్యవధిలోనే దొంగలు తప్పించుకున్నారు. ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి హూటాహుటిన అక్కడికి వెళ్లడంతో రూ.13.29 లక్షలు భద్రంగా ఉన్నాయి. అదే గనక మండల కేంద్రంలోనే పోలీస్‌స్టేషన్ ఉంటే పక్కాగా దొంగలు పట్టుబడేవారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు అనివార్యం అయ్యింది.
నూతన మండలాలుఏర్పాటై ఏళ్లు గడుస్తున్న వైనం
పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు వీడని గ్రహణం
కాగితాలకే పరిమితమైన ప్రతిపాదనలు
అత్యవసర సమయాల్లో ఇబ్బందులు

కలగానే కొత్త ఠాణాలు..!