
చిక్కని చిరుత
మహబూబ్‌నగర్ న్యూటౌన్: చిరుత సంచారం మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పండుగ సాయన్న గుట్ట (టీడీ గుట్ట), డంపింగ్ యార్డు తదితర ప్రాంతాల్లో ఉన్న గుట్టలపై తరచూ తిరుగుతూ పరిసర ప్రాంతాల ప్రజలకు కనిపిస్తోంది. చిరుతను బంధించి అడవిలో వదలాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించగా.. అటవీ, పోలీసు అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి రెండు వారాలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా ఆచూకీ దొరకడం లేదు. చిరుతను బంధించేందుకు రెండు బోన్లు, సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లతో అన్వేషణ కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కనిపించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, రాత్రి, తెల్లవారుజామున బయట తిరుగొద్దని స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఓవైపు గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. మరోవైపు చిరుత సంచరిస్తున్న వీడియోలు వైరల్‌గా మారుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిరుత ఒకటి ఉందా.. అంతకుమించి ఉన్నాయా అనే దానిపై స్పష్టత రావడం లేదు.
మళ్లీ కనిపించిన చిరుత..
పండుగసాయన్న గుట్ట(టీడీ గుట్ట)లో ఆదివారం ఉదయం చిరుత సంచరిస్తున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు గుర్తించి తీసిన వీడియోలు వైరల్‌గా మారాయి. సున్నంబట్టి ప్రాంతంలోని పెట్రోల్‌బంక్ సమీపంలో చిరుత కనిపించిన ప్రాంతానికి అదనపు ఎస్పీ రత్నం, సీఐ అప్పయ్య, ఎఫ్‌ఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఎఫ్‌బీఓలు శశికళ, జీవిత, మౌనిక, రాధ చేరుకొని పరిశీలించారు. చూసిన వారితో మాట్లాడి సమాచారం సేకరించారు. రెండు చిరుతలను తాము ప్రత్యక్షంగా చూసినట్లు పేర్కొన్నారు. అటవీశాఖకు చెందిన మూడు బృందాలు, పోలీసు సిబ్బంది గుట్టపైకి చేరుకొని డ్రోన్లతో గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. తమకు రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు అధికారులకు మొర పెట్టుకోగా అన్ని చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ వివరించారు.
బోన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో అన్వేషణ
భయాందోళనలో పట్టణవాసులు

చిక్కని చిరుత