
ఉలిగేపల్లిలో విద్యార్థి బలవన్మరణం
మల్దకల్: చదువుకోమని తండ్రి మందలించగా.. కొడుకు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మండలంలో ఉలిగేపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. ఉలిగేపల్లికి చెందిన కుర్వ కిష్టన్న, సవారమ్మకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు హరికృష్ణ(16) ఇటీవల పదో తరగతి పాసయ్యాడు. హరికృష్ణ నాలుగు రోజుల కిందట నల్గొండ జిల్లా సర్వేలలో టీఎస్ ఆర్‌జేసీలో ఇంటర్ అడ్మిషన్ పొందాడు. ఇదిలా ఉండగా హరికృష్ణ ఇంటర్ చదివేందుకు నిరాకరించాడు. దీంతో తండ్రి మందలించగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
కొత్తకోట రూరల్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తకోట మండలం పామాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్ తెలిపిన వివరాలిలా.. పామాపురం గ్రామానికి చెందిన బత్తుల శివన్న(45)కు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. శివన్న గ్రామంలోనే ఉంటూ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. ఈక్రమంలో ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. దీంతో కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. అప్పుల బాధ ఎక్కువవడంతో చేసేదే లేక ఈనెల 11న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న పక్కింటి వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఇంటికి చేరుకున్న భార్య బత్తుల లక్ష్మి అపస్మారక స్థితిలో ఉన్న భర్తను 108లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివన్న ఆదివారం మృతి చెందాడు.మృతుడిభార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి
● చేపలకుంటలో పడి వ్యక్తి..
ఉరేసుకుని మహిళ
నవాబుపేట: మండలంలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని సత్రోనిపల్లితండాలో చేపలకుంటలో పడి వ్యక్తి మృతిచెందాడు. దమ్మంబాయితండాకు చెందిన బన్ని (22) అమ్మమ్మ గ్రామం సత్రోనిపల్లిలో ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ వెళ్లి ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలో రైతు ఏర్పాటు చేసుకున్న చేపలకుంటలో పడి మృతిచెందాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వివరించారు. అలాగే మండలంలోని తిమ్మయ్యపల్లిలో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తిమ్మయ్యపల్లికి చెందిన భేరి అరుణ(28) భర్త అనారోగ్యంతో మృతిచెందడంతో మనోవేదనకు గురై ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు. మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అనుమానాస్పద
స్థితిలో వ్యక్తి మృతి
పెద్దకొత్తపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీష్ కథనం మేరకు.. మండలంలోని కల్వకోలుకు చెందిన కర్ణాటి దామోదర్‌గౌడ్ (48) రెండ్రోజులుగా కనిపించకపోవడంతో భార్య కర్ణాటి నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సింగోటం చెరువులో ఒంటిపై గాయాలతో మృతదేహం కనిపించగా బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
విద్యార్థి అదృశ్యం
కొత్తకోట రూరల్: పట్టణంలో ఎస్సీ కాలనీకి చెందిన మ్యాదరి బన్ని తప్పిపోయిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్ వివరాల మేరకు.. మ్యాదరి సింధూ, బాబుల కుమారుడు చిన్న కుమారుడు బన్ని పెద్దమందడి ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 10న జ్వరం వచ్చిందని ఇంటికి వచ్చాడు. దీంతో తరచూగా ఇంటికి ఎందుకు వస్తున్నావని మందలించారు. దీంతో అదే రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువుల, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

ఉలిగేపల్లిలో విద్యార్థి బలవన్మరణం

ఉలిగేపల్లిలో విద్యార్థి బలవన్మరణం