
జనాభా కట్టడిలో యువత పాత్ర కీలకం
పాలమూరు: పెరుగుతున్న జనాభాను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ పద్మజ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాత వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కు.ని., ఇతర ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్న కుటుంబాలు ఉంటే పిల్లల పోషణ సక్రమంగా ఉంటుందన్నారు. జనాభా నియంత్రణకు శాశ్వత పద్ధతులైన ట్యూబెక్టమీ, వేసెక్టమీ ద్వారా ఆపరేషన్లు చేయించుకుని చాలా వరకు నియంత్రణ చేయడం జరిగిందని, దీనిని మరింత తగ్గించాలన్నారు. ప్రస్తుతం దేశ జనాభా 140కోట్లపైనే ఉందని, కొన్ని రోజుల తర్వాత చైనాను మించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందనుందన్నారు. జనాభాను తగ్గించడంలో యువత పాత్ర చాలా కీలకమని చెప్పారు. అనంతరం జనాభా పెరగడం వల్ల వచ్చే సమస్యలపై నర్సింగ్ విద్యార్థులు నాటక ప్రదర్శన చేసి చూపించారు. అలాగే ఒక్క సంతానంతో ఆపరేషన్ చేసుకున్న దంపతులు, అంతర ఇంజెక్షన్లు వాడిన దంపతులకు రూ.వెయ్యి పారితోషికం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్‌నాయక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి మల్లికార్జున్, డెమో మంజుల తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ అవార్డుల అందజేత
ఈ ఏడాది ఉత్తమ పనితీరు కనబరిచిన వైద్యాధికారులు, సిబ్బందికి అవార్డులు అందించారు. ఉత్తమ సర్జన్‌గా భాస్కర్‌నాయక్, ఉత్తమ మెడికల్ ఆఫీసర్లుగా చంద్రశేఖర్ (గండేడ్), మనుప్రియ (జడ్చర్ల), శ్రావణ్‌కుమార్ (నవాబ్‌పేట), ఉత్తమ స్టాఫ్ నర్సులుగా స్వాతి (భూత్పూర్), జయమ్మ (దేవరకద్ర), ఉత్తమ సూపర్‌వైజర్లుగా ప్రసన్న, రామనాథ్, ఉత్తమ ఎంపీహెచ్‌ఏలు నిర్మల, శైలజ, వహీద్, దేవయ్య, ఉత్తమ ఆశలుగా సుల్తానా, యాదమ్మ, మైబమ్మలకు అందించారు.