కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

Jul 19 2025 4:04 AM | Updated on Jul 19 2025 4:04 AM

కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

జడ్చర్ల: బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జడ్చర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కోనేటి పుష్పలత కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరారు. ఆమెతోపాటు బీఆర్‌ఎస్‌కు చెందిన 7వ వార్డు కౌన్సిలర్‌ గుండు ఉమాదేవి, బీజేపీకి చెందిన 16వ వార్డు కౌన్సిలర్‌ లలిత సైతం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్‌ పార్టీలో చేరా రు. వీరికి సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా.. జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి నూ.70 కోట్లు మంజూరు చేయాలని చైర్‌పర్సన్‌ పుష్పలత సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అయితే తాము మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ను వీడి అధికార పార్టీలో చేరామని వారు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌లో కలవరం

చైర్‌పర్సన్‌ పుష్పలత అకస్మాత్తుగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం పట్ల బీఆర్‌ఎస్‌లో ఒక్కసారిగా కలవరం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అనూహ్యంగా చైర్‌పర్సన్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకెళ్లి బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చారు. దీంతో మున్సిపాలిటీలో పైచేయి సాధించినట్లుగా భావిస్తున్నారు. పాలక మండలి పదవీకాలం మరో 9 నెలలు ఉన్న నేపథ్యంలో జడ్చర్ల మున్సిపాలిటీ కాంగ్రెస్‌ ఖాతాలో చేరడం గమనార్హం. కాగా గతేడాది నవంబర్‌ 18న మున్సిపల్‌లో అవిశ్వాసం నెగ్గి ఏకగ్రీవంగా పుష్పలత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సరిగ్గా 8 నెలలకే ఆమె పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం.

మరికొందరు కౌన్సిలర్లు..

మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం 27 వార్డులకు గాను బీఆర్‌ఎస్‌ 23, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి చెరో రెండు స్థానాల్లో గెలిచారు. మారిన రాజకీయ సమీకరణలో ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ గూటికి చేరగా బీఆర్‌ఎస్‌ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు సైతం చేయి అందుకున్నారు. మరి కొందరు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరికపై బీఆర్‌ఎస్‌ వైఖరి ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

అభివృద్ధి సాధ్యమయ్యేనా..?

మున్సిపాలిటీలో ఇప్పటికై నా అభివృద్ధి ముందుకు సాగేనా అన్న చర్చ సాగుతుంది. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌ ఖాతాలో పాలన ఉండడంతో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు ఉన్నాయి. ఏనాడూ పాలక మండలి సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఇప్పటికై నా సమావేశాలకు హాజరై సభ్యులు లేవనెత్తే సమస్యలపై దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

అదే దారిలో ఇద్దరు కౌన్సిలర్లు సైతం

సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement