
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
జడ్చర్ల: భూ సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బూరెడ్డిపల్లి శివారులోని సర్వే నంబర్లు 102, 117లలో గల భూములకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించారు. ఆయా సర్వే నంబర్లలోని అసైన్డ్ భూముల గురించి తహసీల్దార్ నర్సింగరావును అడిగి తెలుసుకున్నారు. అలాగే రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై విచారిస్తున్నామని, ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు.
బాధ్యతలు చేపట్టిన
రిజిస్ట్రార్
మెట్టుగడ్డ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి రిజిస్ట్రార్ ఫణీందర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌లతో సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సబ్ రిజిస్ట్రార్‌లకు సూచించారు. జూన్ 30న జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ పదవీ విరమణ పొందడంతో ఇప్పటి వరకు ఈ స్థానం ఖాళీగానే ఉంది. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా రిజిస్ట్రార్‌కు మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
బ్యాంకింగ్ సేవలను
వినియోగించుకోవాలి
కోయిల్‌కొండ: మహిళలు బ్యాంకింగ్ సేవలను వినియోగించుకొని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి షణ్ముఖచారి అన్నారు. మండలంలోని రామన్నపల్లితండాలో నిర్వహించిన నాబార్డు ఫౌండేషన్ డేలో ఆయన రైతులు, గ్రామస్తులకు పండ్ల మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు నాబార్డు ఆధ్వర్యంలో స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, డెయిరీ, పౌల్ట్రీ తదితర రంగాల్లో రుణాలు పొందడానికి ముద్ర యోజన ద్వారా అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నాబార్డు అమలు చేస్తున్న వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి సహకార సంఘాల ఆవశ్యకత, సహకార భావనపై ప్రజలను చైతన్యం చేశారు. సామాజిక భద్రత పథకాలు, బ్యాంక్ రుణ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. బ్యాంకు అధికారులు పథకాల అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రయోజనాలు, రీ పేమెంట్ షరతులపై ప్రజలకు సరళమైన భాషలో వివరించారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం చంద్రశేఖర్, టీజీబీ బ్రాంచ్ మేనేజర్ తమిళ్ వెందన్, ఫీల్డ్ ఆఫీసర్ చెన్నకేశవులు, ఎఫ్‌ఎల్‌సీ కౌన్సిలర్ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు