
విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సురవరం వెంకటరమణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాం, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా విద్యాసంస్థలను గాలికి వదిలేశారని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థలకు మూడేళ్ల నుంచి స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు పేరుకుపోయి.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంట గదులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంధ్‌కు అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.