మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రతి వ్యాపారంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని, రాష్ట్రానికి మహబూబ్‌నగర్ ఎస్‌హెచ్‌జీలు ఆదర్శం కావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో నియోజకవర్గ మహిళా శక్తి సంబరాలతో పాటు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిన్నర కాలంలో తమ కోసం ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్ రాయితీ, మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంక్‌లు, బస్సులకు యజమానులుగా మార్చామని, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతను గత ఏడాది నుంచి మహిళలకు అప్పగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. ఇలాంటి తమ విజయగాధలు చూసిన తర్వాత మహబూబ్‌నగర్ కాస్తా మహిళానగర్ అయిందన్నారు. పాలమూరు ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతన్నందున ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో ఇక్కడి వస్తున్నారన్నారు. అంతకుముందు కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ మహిళలకు ఆదాయం వచ్చే వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా పౌల్ట్రీఫాంలు, పశువుల కొనుగోలు, వరి ధాన్యం కొనుగోలు, ‘ఆదర్శ పాఠశాల’ ద్వారా రూ.20 కోట్లతో మరమ్మతు పనులు చేయించామన్నారు. అనంతరం మెప్మా పరిధిలోని ఏఎల్‌ఎఫ్‌కు బ్యాంకు లింకేజీ కింద రూ.8.25 కోట్లు, లోన్ బీమా కింద రూ.11.25 లక్షలు, నియోజకవర్గ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.1.67 కోట్లు, బ్యాంకుల నుంచి రుణాలు రూ.7.90 కోట్ల విలువ జేసే చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, సెర్ప్ డైరెక్టర్ కాశీ విశ్వేశ్వరయ్య, డీఆర్‌డీఓ నర్సింహులు, ఏపీడీ శారద, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ నాయకులు సిరాజ్‌ఖాద్రీ, షబ్బీర్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
శిల్పారామంలో మహిళాశక్తి
సంబరాలు, ఫుడ్ ఫెస్టివల్