
దంచికొట్టిన వాన
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో గురువారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 29.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాలానగర్ మండలంలో 100.8 మి.మీ., మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 3.5 మి.మీ., వర్షం కురిసింది. రాజాపూర్ మండలంలో 52.3 మి.మీ, భూత్పూర్‌లో 47.6, మిడ్జిల్‌లో 46.0, మూసాపేటలో 44.0, జడ్చర్లలో 39.7, నవాబుపేటలో 36.5, అడ్డాకులలో 33.3, దేవరకద్రలో 18.1, గండేడ్‌లో 19.1, మహమ్మదాబాద్‌లో 17.0, హన్వాడలో 11.6, కౌకుంట్లలో 10.3, కోయిలకొండలో 7.5, చిన్నచింతకుంటలో 6.3, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 10.6 మి.మీ., వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా వర్షాలు కురవక ఎండుముఖం పట్టిన ఆరుతడి పంటలకు ఈ వర్షం జీవం పోసినట్లయ్యింది. మరికొందరు నారు పోసుకుని వరి నాటేందుకు ఎదురుచూస్తుండగా.. గురువారం రాత్రి కురిసిన వర్షంతో కొంత ఊరట చెందారు.
దుందుభీకి వరదొచ్చింది..
మిడ్జిల్: జిల్లాలోని బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల గుండా ప్రవహిస్తూ.. వేలాది ఎకరాలకు సాగునీటి భరోసా కల్పిస్తున్న దుందుభీ వాగుకు ఎట్టకేలకు వరదొచ్చింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని మున్ననూర్ గుండా దుందుభీ వాగు శుక్రవారం ప్రవహించింది. దుందుభీ వాగు జూలైలోనే ప్రవహించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాలు పెరిగి రెండు పంటలకు సాగునీటి ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడుతున్నారు.
బాలానగర్ మండలంలో అత్యధికంగా 100.8 మి.మీ., వర్షపాతం నమోదు ఆరుతడి పంటలకు జీవం