
మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని..
ఊర్కొండ: అధికార పార్టీ నాయకులతో కొందరు అధికారులు కుమ్మకై ్క తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఓ మహిళా రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం.. ఊర్కొండపేట శివారు సర్వే నం.220లో ఏ.3.39 ఎకరాల భూమి తమ తాతల కాలం నుంచి స్వాధీనంలో ఉందని మహిళా రైతు శశికళ, శేఖర్‌రెడ్డి తెలిపారు. వాటిలో కోళ్ల ఫారం పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నామని, అవసరాల కోసం బ్యాంకు రుణం తీసుకొని వన్‌టైం సెటిల్‌మెంట్ చేసుకొని పూర్తిగా చెల్లించామన్నారు. బ్యాంకు వారు తమ భూమి విడుదల చేసినట్లుగా మా వద్ద అన్ని రశీదులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ బ్యాంకు తమ మధ్య కోర్టులో మూడేళ్లుగా కేసు నడుస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ పీఏ బంధువులు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారన్నారు. దీనిని తిరిగి సోమవారం వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిసి తహసీల్దార్ కార్యాలయం చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మహిళా రైతు శశికళ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు జోక్యం చేసుకొని పెట్రోల్ డబ్బాను లాక్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు.

మహిళా రైతు ఆత్మహత్యాయత్నం