
రేచీకటితో బాధపడుతూ యువకుడి బలవన్మరణం
రాజోళి: రేచీకటితో బాధపడుతున్న యువకుడు మనోవేధనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకోగా.. సోమవారం కేసు చేసినట్లు ఎస్‌ఐ గోకారి తెలిపారు. ఎస్‌ఐ పేర్కొన్న వివరాల ప్రకారం.. రాజోళికి చెందిన కురవ అంజనేయులు సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా.. కుమారుడు భాస్కర్(23)కు ఇంకా పెళ్లి కాలేదు. ఆయనకు రేచీకటిలో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తల్లిదండ్రులు పొలానికి వెళ్తూ, తమ వెంట రావాలన్నారు. కానీ తర్వాత వస్తానని చెప్పిన భాస్కర్ ఇంట్లోనే ఉంన్నాడు. కొద్దిసేటికి పురుగుల మందు తాగి వాంతులు చేసుకోగా చుట్టు పక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే బాధితుడిని కర్నూలులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోకారి పేర్కొన్నారు.
చేపల వేటకు వెళ్లి
వ్యక్తి మృతి
పాన్‌గల్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన ఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన సంగనమోని పరుశరాముడు(45) నిత్యం చేపలు పట్టి విక్రయించి వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. ఇదే క్రమంలో ఈనెల 4వ తేదీన చేపల వేటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర, చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో సోమవారం గ్రామ శివారులోని సింగాయిపల్లి రోడ్డు పక్కన నల్లకుంట చెరువులో మృతదేహం ఉందని గ్రామస్తులు తెలపడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా.. అది సంగనమోని పరుశరామునిదిగా గుర్తించారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెంది ఉంటాడని, మృతుడి తల్లి సంగనమోని కోమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పాముకాటుతో వ్యక్తి మృతి
అయిజ: పాముకాటుతో వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని నౌరోజి క్యాంప్ గ్రామానికి చెందిన రామకృష్ణ(35) ఆదివారం ఉదయం ఇంటి బయట పనులు చేసుకుంటుండగా పాము కాటేసింది. పక్క గ్రామానికి చెందిన వ్యక్తి పాముకాటుకు మంత్రం వేశాడు. మంత్రం వేయించుకున్నాసరే చికిత్స చేయించుకోవాల్సిందేనని మంత్రం వేసిన వ్యక్తి రామకృష్ణకు చెప్పినా నిర్లక్ష్యం చేశాడు. విషం పాకుతున్నట్లు అనుమానం రావడంతో రాత్రి కుటుంబ సభ్యులకు తెలిపాడు. పట్టణంలోని పీహెచ్‌సీకి వెళ్లారు. పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం బొజ్జమ్మకు పాముకాటు వేసిన విషయం తెలిపారు. గద్వాలకు వెళ్లాలని ఏఎన్‌ఎం చెప్పడంతో గద్వాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. రామకృష్ణకు భా ర్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. స కాలంలో ఇంజక్షన్ చేసి ఉంటే రామకృష్ణ బతికి ఉండేవాడని గ్రామస్తులు వాపోతున్నారు.
బైక్ అదుపుతప్పి
వ్యక్తి దుర్మరణం
వనపర్తి రూరల్: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. పెబ్బేర్ ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి కథనం ప్రకారం.. పెబ్బేర్‌కు చెందిన అబ్దుల్ ఖదీర్ (31) ఏబీడీ కంపెనీలో అపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 6వ తేదీ రాత్రి బైక్‌పై మెకానికి వెంకటేశ్‌తో కలిసి ఖదీర్ చెలిమిల్లకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున బైక్‌పై శ్రీరంగాపూర్ నుంచి పెబ్బేర్‌కు వెళ్తూ కంచిరావుపల్లి మలుపు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడడంతో తలకు బలమైన గాయాలై మృతిచెందాడు. మృతుడి భార్య సమదానీ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం
ఢీకొనడంతో..
కొత్తకోట రూరల్: గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కొత్తకోట మండలంలోని కనిమెట్ట ఎన్‌హెచ్ 44పై సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన వెల్డింగ్ కృష్ణయ్య (48) మదనాపురం మండలంలోని తిర్మలాయపల్లిలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి కుమార్తె సింధుతో కలిసి వెళ్లాడు. కార్యక్రమం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా కనిమెట్ట సమీపంలో సాయిఅమృత దాబా వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో కృష్ణయ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న సింధు ఎగిరి కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. సింధు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ఆనంద్ తెలిపారు.