
రేబిస్‌పై అవగాహన పెంచుకోవాలి
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జంతువుల నుంచి సోకే రేబిస్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మధుసూదన్‌గౌడ్ అన్నారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని జిల్లా పశువైద్యశాలలో ఉచిత రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దీనిని జేడీ డాక్టర్ మధుసూదన్‌గౌడ్ లాంఛనంగా ప్రారంభించగా.. సాయంత్రం వరకు పిల్లులు, కుక్కలకు పశువైద్యులు యాంటీ రేబిన్ ఇంజెక్షన్లు వేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ పెంపుడు కుక్కలకు ఏడాదికి ఒకసారి రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. ఆస్పత్రిలో రేబిస్ వ్యాక్సిన్ నిరంతరం అందుబాటులో ఉంటుందని, తమ పెంపుడు కుక్కలకు ఎప్పుడైనా వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచించారు. రేబిస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. ఉచిత రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమ, మంగళవారాలు కూడా కొనసాగుతుందని జిల్లా పశువైద్యశాల సహాయ సంచాలకులు శివానందస్వామి తెలిపారు. జూనోసిస్ డే రోజు తమ శునకాలకు టీకాలు వేయించని వారు ఎవరైనా ఉంటే ఈ సేవలు పొందవచ్చన్నారు. మొదటిరోజు 205 శునకాలకు టీకాలు వేశామని చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు ప్రహ్లాద్, జేవ్య పాల్గొన్నారు.