
ట్రాక్టర్‌టైరుకు తగిలి బాలుడి మృతి
అచ్చంపేట రూరల్: ఇంటి ముందు గడ్డిని తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు బాలుడు ట్రాక్టర్ టైర్‌కు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని శివారుతండాలో చోటుచేసుకుంది. సిద్ధాపూర్ పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ నర్సింహారెడ్డి కథనం ప్రకారం.. తండాకు చెందిన హన్మంత్ ఆదివారం తన ఇంటిముందర ట్రాక్టర్‌తో గడ్డిని తొలగిస్తుండగా వెనక టైర్‌కు అతని కుమారుడు జశ్వంత్(4) ప్రమాదవశాత్తు వచ్చి తగిలాడు. బాలుడి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. హన్మంతు దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. చిన్న కుమారుడు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
రైలునుంచి జారిపడి వ్యక్తికి గాయాలు
నవాబ్‌పేట/ ఉండవెల్లి: రైలునుంచి జారిపడి మండలానికి చెందిన వ్యక్తి గాయపడిన ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. మండలంలోని కారుకొండకు చెందిన నరేందర్ జిల్లాకేంద్రం నుంచి తిరుపతికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తున్నాడు. కాగా ఉండవెల్లి రైల్వేసేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు డోరు వద్ద ఉండగా.. జారిపడి గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని వెంట ఉన్న వారు కర్నూలు ఆస్పత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు.
గుప్తనిధుల కోసం
రైతు పొలాల్లో తవ్వకాలు
కోడేరు: గుప్తనిధుల కోసం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైతుల పొలాల్లో తవ్వకాలు చేపట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని ఎత్తంగట్టు సమీపంలో బాలస్వామి పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని అక్కడ కుంకుమ, పసుపు, అగరు బత్తులు, నిమ్మకాయలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఎస్‌ఐ జగదీశ్వర్‌ను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.