ఈద్ ముబారక్..
నేడు ఈద్–ఉల్–అజ్‌హా
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లావ్యాప్తంగా శనివారం బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం చివరి మాసమైన జిల్‌హిజ్జా 10వ తేదీన జరుపుకొనే ఈ పండుగను ‘ఈద్–ఉల్–అజ్‌హా’గా వ్యవహరిస్తారు. సామూహికంగా ముస్లింలు ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక నమాజ్ చేయడం రివాజు. సర్వమానవ కల్యాణం కోసం నమాజ్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలు ధరించి.. ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు రియాజుల్ జన్నా మసీదు నుంచి ముస్లింలు ఊరేగింపుగా జామియా మసీదు, గడియారం చౌరస్తా మీదుగా స్థానిక రహెమానియా ఈద్గా వద్దకు చేరుకొని 9 గంటలకు ప్రత్యేక ఈద్ నమాజ్ చేస్తారు. అదే విధంగా పట్టణంలోని పలు మసీదుల్లో కూడా బక్రీద్ ప్రత్యేక ఈద్ నమాజ్‌కు ఏర్పాట్లు చేశారు.
ఖౌమి ఏకతా కమిటీ ఆధ్వర్యంలో వేదిక..
బక్రీద్ సందర్భంగా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి ఈద్గా ఆవరణలో ఖౌమి ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదిక వద్ద ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ వేదిక గంగాజమున తహ్‌జిబ్‌కు ప్రతీకగా నిలుస్తుంది.
పండుగ ప్రాశస్త్యం..
ఇబ్రాహీం ఖలీలుల్లా రజియల్లాహు తాలా అనే పైగంబర్ (ప్రవక్త) దంపతులు చేపట్టిన నియమ నిష్టల ఫలితంగా వారికి ఇస్మాయీల్ జబీవుల్లా అనే ఏకై క కొడుకు జన్మిస్తాడు. అయితే వారి భక్తి, త్యాగాన్ని పరీక్షించడానికి అల్లా తన కొడుకును బలి ఇవ్వాల్సిందిగా ఇబ్రాహీం కలలో కనిపించి ఆజ్ఞాపిస్తాడు. దైవ నిర్ణయాన్ని శిరసావహించడమే మార్గదర్శకంగా భావించిన ఆ దంపతులు.. తమ కుమారుడిని బలి ఇవ్వడానికి నిర్ణయించి అంతా సిద్ధం చేస్తారు. దైవాదేశం మేరకు ఆ బాలుడిని సుదూర ప్రాంతమైన అడవుల్లోకి తీసుకెళ్లి బలి పీఠంపై పీక కోయడానికి తండ్రి సిద్ధమవుతుండగా.. ఆ ఖుర్బానీ ప్రక్రియను ఆపివేయాలని దైవవాణి వినిపిస్తుంది. దైవ వాక్కు వృథాగా పోకూడదని ఇస్మాయీల్ జబీవుల్లా స్థానంలో అటుగా వచ్చిన ఓ పొట్టేలును బలి ఇవ్వాలని ఆదేశిస్తుంది. మానవ కల్యాణం కోసమే ఈ సంఘటన జరిగిందని భావించి ముస్లింలు ఆ నాటి నుంచి బక్రీద్ పండుగ దినాల్లో ఖుర్బానీ ఇస్తారు.
ఈద్గాలు, మసీదుల్లో నమాజ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
ఖుర్బానీ కోసం పొట్టేళ్ల కొనుగోళ్లు
కిటకిటలాడుతున్న మార్కెట్లు


