రుణాలు రూ.600 కోట్లకు పెంచుతాం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆదాయపు రిటర్న్స్ వందశాతం ఫైల్ చేస్తామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలలలోపే రూ.300 కోట్లు వ్యవసాయ రుణాలు మంజూరు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో రూ. 600 కోట్లకు వ్యవసాయ రుణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలతో నిర్వహించిన సమావేశానికి చైర్మన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవగాహనారహిత్యం కారణంగా జిల్లాలో ఇంకా 46 సొసైటీలు ఇన్‌కమ్ టాక్స్ ఫైల్స్ రిటర్న్స్ చేయలేదన్నారు. ప్రస్తుతం వచ్చిన చట్టాలకు అనుగుణంగా రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం సొసైటీల చైర్మన్లు, సీఈఓలకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తాము నిర్వహించబోయే బ్యాంకు సర్వసభ్య సమావేశంలో ఈ విషయం గురించి చర్చిస్తామని, భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని అన్నారు. ఇప్పటికే ఇన్‌కామ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి నోటీసులు అందుకున్న వారు రిటర్న్స్ ఫైల్ చేయడంలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులకు ఇళ్లు నిర్మించుకోవడానికి, తమ పిల్లలను ఉన్నత చదువు చదివించుకోవడానికి, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి అవసరమైన రుణాలను మంజూరు చేస్తామని వెల్లడించారు. రుణ సదుపాయాన్ని పెంచుకోవడం ద్వారానే బ్యాంకుకు ప్రగతి నెలకొంటుందని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లురవి, జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ బ్యాంకు అభివృద్ధికి తమ శాయశక్తులా సహకరిస్తున్నారని, ఇటీవల బ్యాంకును సందర్శించిన నాబార్డు బృందం బ్యాంకు నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, ఇన్‌కామ్ టాక్స్ అదనపు కమీషనర్ వంశీకృష్ణ, మహబూబ్‌నగర్ వార్డు–1 ఆఫీసర్ మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆదాయ పన్ను రిటర్న్స్ వందశాతం
ఫైల్ చేస్తాం
డీసీసీబీ చైర్మన్
మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి


