
మేకలు కాసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి..
గోపాల్‌పేట: మేకలు కాసేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని నర్సింగాయపల్లి శివారులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. నర్సింగాయపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, కృష్ణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వెంకటయ్య ఎనిమిది నెలల క్రితం గ్రామానికి సమీపంలోనే చెట్టు మీద నుండి కిందపడి మృతి చెందాడు. తల్లి కృష్ణమ్మ కూలీ పనులు చేస్తూ.. పిల్లలు మేకలు కాస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం మధ్యాహ్నం పిల్లలు లిల్లి (10), గణేష్ (5) ఇద్దరూ మేకలు మేపుతూ బయటికి వెళ్లారు. శనివారం సాయంత్రం ఎనిమిది గంటల వరకు మేకలు ఇంటికి వచ్చినా.. పిల్లలు రాలేదు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వెతికేందుకు గ్రామానికి సమీపంలోని చెట్ల వైపు వెళ్లి వెతుకుతుండగా నర్సింగాయపల్లికి సమీపంలోని ఓ బావి వద్ద లిల్లి, గణేష్ కు చెందిన చెప్పులు, బట్టలు కనిపించాయి. గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో వెతకగా.. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో లిల్లి, గణేష్ మృతదేహాలు లభించాయి.