
ఉగ్రదాడులను అరికట్టడంలో విఫలం
కల్వకుర్తి రూరల్: ఉగ్రదాడుల నుంచి దేశాన్ని, ప్రజల ప్రాణాలను రక్షించడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం నిర్వహించిన పార్టీ జిల్లా నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక యూటీఎఫ్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాపై చైనాతో పాటు చిన్న చిన్న దేశాలు టారిఫ్‌లు విధిస్తుంటే.. ప్రధాని మోదీ అమెరికాకు మోకరిల్లడాన్ని సీపీఎం ఖండిస్తుందన్నారు. భారత్, పాకిస్తాన్ యుద్ధం తమవల్లే ఆగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ ప్రధాని ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పహల్గాంలో టూరిస్టులను హతమార్చిన ఉగ్రవాదులను ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేకపోయారని నిలదీశారు. 27 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్‌పై యుద్ధం ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో 500 మంది నక్సలైట్లను హత్య చేశారని అన్నారు. కాల్పుల విరమణ పాటిస్తామని.. చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు చెబుతున్నప్పటికీ కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే స్పందించి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులు ఇస్తే రావని.. పోరాడి సాధించుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పెంపు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇతర నిధుల కోసం పోరాటమే శరణ్యమని ఆయన సూచించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై స్పందించాలన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేయడంతో పాటు ప్రాంతీయ పార్టీలను అణిచివేస్తుందని ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో బీజేపీతో పొత్తు ఉండదనే విషయాన్ని కేసీఆర్ తేల్చి చెప్పాలన్నారు.
మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి
హక్కుల సాధన కోసం పోరాడుదాం
కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ