
రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించండి
బల్మూర్: నల్లమల ప్రాంతంలోని బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు సహకరించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం స్టేజ్–1 నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులతో శనివారం బల్మూరులోని జిల్లా పరిషత్ మైదానంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రైతుల అభిప్రాయాల అనంతరం మాట్లాడారు. బల్మూర్ సమీపంలో చేపడుతున్న ఈ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలనే ప్రతిపాదన వినతిపత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశామన్నారు. అలాగే ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసి స్థానిక నిర్వాసితులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగావకాశాలతోపాటు చెంచు రైతులకు భూమికి భూమి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డిజైన్‌లో అనంతవరం, బల్మూర్ గ్రామాలకు ముప్పు ఉందని, ఇళ్లు కూడా కోల్పోతారని గుర్తించి 2.67 టీఎంసీల నుంచి 2.40 టీఎంసీలకు కుదించి రీడిజైన్ మార్పు చేయించానన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ బాలస్వామి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ రాఘవులు పాల్గొన్నారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భూ సేకరణ రైతు అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఉద్రిక్తల మధ్య కొనసాగినబల్మూరు గ్రామసభ