
హిందూ ధర్మ పరిరక్షణే ముఖ్యం
ఎర్రవల్లి: హిందూ ధర్మం, సంస్కృతిని కాపాడేందుకు ప్రతి హిందువు పాటుపడాలని ధర్మప్రసార సమితి రాష్ట్ర ప్రముఖ్ వెంకటేశ్వరరావు జాదవ్ అన్నారు. సోమవారం మండలంలోని కోదండరామస్వామి ఆలయంలో వివిధ మండలాలకు చెందిన ధర్మప్రసార సమితి సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరైన ఆయన విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రసార సమితి నిర్వహిస్తున్న వివిధ అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. హిందూ సమాజాన్ని ఏకం చేయడంతో పాటుగా సేవ చేయడం కోసం 1964లో వీహెచ్‌పీని స్థాపించినట్లు తెలిపారు. దీని ద్వారా 1966లో కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌లో హిందువుల ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రతి మండలంలో హిందూ సమాజం కోసం వీహెచ్‌పీతో పాటుగా ధర్మ ప్రసార సమితి కూడా అంతర్గత భాగమై పనిచేస్తూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. హిందూ దేవాలయాల పుణరుద్ధరణ, నిర్మాణం కోసం సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత మార్పిడితో పాటు గోహత్యలను అడ్డుకుకోవాలని కోరారు. అనంతరం ఇటిక్యాల మండలంలోని పెద్దదిన్నె బాల సంస్కార కేంద్రానికి చెందిన చిన్నారులు శ్రీరామ వంశవృక్షం, హనుమాన్ చాలీసా, భగవద్గీత, ప్రార్థన శ్లోకాలు, గోవిందనామాలను కంఠస్థంగా వివరించారు. ప్రతిభను కనబర్చి చిన్నారులను సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహ ప్రముఖ్ బ్రహ్మానందగౌడ్. జిల్లా ప్రముఖ్ సత్యం, ఫణిమోహన్‌రావు, మదన్‌మోహన్, నర్సింహ, రాఘవేంద్ర, జగదీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.