
బీజీ–3 కలకలం..
జిల్లావ్యాప్తంగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు
●
అత్యంత ప్రమాదకరం
బీజీ–3 విత్తనాలు అత్యంత ప్రమాదకరం కావడంతో ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని లూజ్ విత్తనాలను రైతులకు విక్రయించడం తగదు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. బీజీ–3 పత్తి విత్తన విక్రయాలపై గట్టి నిఘా పెట్టాం. బీజీ–3 విత్తనాల సాగు, దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. విత్తనాలు లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరే కొనుగోలు చేసి బిల్లులు తీసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. నకిలీ విత్తనాలను ఎక్కడైనా విక్రయిస్తే చర్యలు తప్పవు. పత్తి పంట ఆకులను పరీక్షించి బీజీ–3 విత్తనాలు సాగు చేసిన రైతులపై చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్, జిల్లా వ్యవసాయాధికారి
● ఏపీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో దిగుమతి
● గ్రామాల్లో గుట్టుగా రైతులకు విక్రయాలు
● తాజా దాడులతో భారీగా పట్టివేత
● ఆలస్యంగా మేల్కొన్న వ్యవసాయాధికారులు
జడ్చర్ల: వానాకాలం (ఖరీఫ్) సీజన్ ఆరంభమవుతున్న వేళ బీజీ–3 నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు కలవరపెడుతున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ విత్తన వ్యాపారులు చాపకింద నీరులా అల్లుకుపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ముందస్తుగా దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారులు వారికి ఎక్కువ మొత్తంలో కమీషన్ ఇచ్చే కంపెనీలు సరఫరా చేసే నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ ఏడాది విత్తనాల లేవంటూ కృత్రిమ కొరత సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు.
విత్తనమే మూలం..
రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే ప్రాథమిక స్థాయిలో విత్తన ఎంపిక కీలకం. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చు. జన్యు, భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవడం మంచిదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. భౌతిక స్వచ్ఛతకు సంబంధించి గింజ పరిమాణం, రంగు వంటివి గమనించి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నాసిరకం విత్తనాలను ఎంపిక చేసుకోవడం వలన తెగుళ్ల బెడదతోపాటు పంట గిడసబారి దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంతేగాక పంట సస్యరక్షణకు మందులను అధిక మొత్తంలో వాడటం వలన రైతులపై ఆర్థిక భారం పడుతుంది.
ప్రధాన వాణిజ్య పంట
ప్రతిఏటా వానాకాలం సీజన్‌లో ప్రధాన వాణిజ్య పంటగా పేరొందిన పత్తిని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ ఏడాది సైతం జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకుపైగా పత్తిని సాగు చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఎక్కువగా పత్తి పంట సాగుకే ప్రాధాన్యత కల్పించడంతో రైతులు సైతం ఆసక్తి చూపుతున్నారు. పత్తి తర్వాత వరి, మొక్కజొన్న, ఆముదం, వేరుశనగ, పెసర, కంది తదితర పంటలను సాగు చేస్తారు. అయితే ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో కొందరు రైతులు ముందస్తుగా పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఈపాటికే విత్తనాలు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. అధికారులేమో ఇప్పుడు నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు.