
ప్రణాళికాబద్ధంగా పాలమూరు అభివృద్ధి
స్టేషన్ మహబూబ్‌నగర్: విజన్–2047తో పాలమూరు అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి మహబూబ్‌నగర్‌ను కార్పొరేషన్‌గా మార్చామన్నారు. విజన్–2047 లక్ష్యంతో నిర్దిష్టమైన ప్రణాళికలతో మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేయడానికి నిపుణులు, కన్సల్టెంట్లు, సర్వేయర్లతో ఆలోచన చేస్తున్నామని, ముందుగా ప్రధాన సమస్యలను గుర్తించినట్లు చెప్పారు. నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉందని, ఇందుకోసం బైపాస్ రోడ్డు అవసరమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. టీయూఐడీఎఫ్ ద్వారా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరా అభివృద్ధి కోసం రూ.220.94 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో భూత్పూర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌తో కలిపి ట్రైసిటీ నగరంగా మారుతుందన్నారు. ప్రస్తుత జనాభా 3 లక్షలు ఉందని, 2047 వరకు 5 లక్షల వరకు పెరుగవచ్చని, అప్పటి అవసరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు. కలలో కూడా ఊహించని విధంగా ప్రాజెక్టులు పాలమూరుకు వస్తున్నాయని, అందులో భాగంగా ఐఐఐటీ కళాశాల ఒకటి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూలకుపడిన అమృత్ స్కీంలో కదలిక తెప్పించామన్నారు. మయూరీ ఎకో అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తామని, త్వరలో పూలే– అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన చేస్తామన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, నాయకులు బెనహర్, కృష్ణయ్య, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.